ముంబై వెళ్లారు.. హైదరాబాద్ వచ్చేశారు.. ఇంతేనా..ఇంకేమైనా ఉందా?
Publish Date:Feb 21, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ముంబై వెళ్ళారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ని కూడా కలిశారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా తొలి అడుగు వేశారు. నిజానికి కేసీఆర్ పర్యటన గురించి (లోపల ఏమి జరిగిందనే విషయాన్ని పక్కన పెడిత) పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ లేదనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందునుంచి అనుకున్నట్లుగానే కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశ మయ్యారు. ముందుగా అనుకోక పోయినా (థాంక్స్ టూ పీకే) శరద్ పవార్’ను కలిశారు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఇద్దరూ కూడా కేసీఆర్’లో ఆయన బృందం హోర్డింగుల్లో హోరెత్తిన రీతిలో, భావి భారత ఆశాజ్యోతిని, కాబోయే ప్రధానిని, జాతీయ నాయకుని చూసినట్లు లేదు. నిజానికి కేసేఅర్ ప్రతిపాదనతో పెద్దగా ఆశక్తి చూపినట్లు కనిపించ లేదనే అంటున్నారు. నిజానికి, బీజేపీని వ్యతిరేకిస్తూ బయటకు రావడం కేసీఆర్ కొత్త (అవసరం) కావచ్చును, కానీ, పవార్, ఠాక్రే లకు కొత్త కాదు. ఠాక్రే అయితే బీజేపీతో ఉన్న సహజ పేగు బంధాన్ని తెంచుకుని బయటకు వచ్చారు. అంతే కాదు, మాజీ మిత్రపక్షంపై రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. పవార్ సంగతి చెప్పనే అక్కరలేదు. నిజానికి, పవార్’కు రాజకీయ పాఠాలు చెప్పడం అంటే, అది కేసీఆర్’ అనే కాదు ఇంకెవరైనా తాతకు దగ్గులు నేర్పడమే అవుతుంది. నిజానికి, ఈరోజు మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేక కూటమి అధికారంలో ఉందంటే, అందుకు కర్తా, కర్మ, క్రియ అన్నీ కుడా పవారే అనే విషయం వేరే చెప్పనక్కర లేదు. అదలా ఉంటే, కేసీఆర్ ముంబై పర్యటనను అన్ని కోణాల్లో పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఠాక్రే, పవార్ ఇద్దరూ కూడా కేసీఆర్’ను అంత సీరియస్’గా తీసుక్కన్నట్లు కనిపించ లేదనే అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వర్గాలలో అయితే, కేసీఆర్ హైదరాబాద్’ ప్రెస్ కాన్ఫరెన్స్’లో ఇచ్చిన బిల్డప్’ ముంబై’లో కనిపించిన సీన్’ కు పొంతన లేదని అంటున్నారు. అలాగే, కేసీఆర్ కూడా హైదరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్’లలో మాట్లాడే ఎక్కువ తక్కువ మాటలేమీ, లేకుండా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు సంబంధాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం (నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్’కు సహకారం అందించింది అప్పటి బీజేపీ ప్రభుత్వం) అందించిన సహకారం గురించే ఎక్కువ మాట్లాడారు. జాతీయ రాజకీయాలకు సంబందించి నిర్దిష్టంగా ఏమీ చర్చించారో చెప్పకుండా, చాలా వరకు ఏకాభిప్రాయం కుదిరిందని.. చెప్పుకొచ్చారు. అంతే కాదు, కూటమిలో కాంగ్రెస్ పార్టీకి చోటు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానాన్ని దాట వేశారు. అయితే శివసేన’ కు మాత్రం ఈ విషయంలో చాలా చాలా క్లారిటీ వుంది. కాంగ్రెస్ లేని ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి వృధా ప్రయాస అవుతుందని , శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో సంజయ్ రౌత్ ఎప్పుడో స్పష్టం చేశారు. అందుకే, కేసీఆర్, ముంబై పర్యటన ద్వారా ఆశించిన ఫలితాలు వచ్చాయా అంటే ... ఆయనకు అదో తుత్తి అంటున్నారు.
అందుకే శరద్ పవార్ ఎందుకైనా మంచిదని ముందుగానే, ‘మా మధ్య రాజకీయ అంశాలు అంతగా చర్చకు రాలేద’ ని కేసేఆర్ ముందే స్పష్టం చేశారు. అలాగే ఠాక్రే, కేసీఆర్ దూకుడుకు కళ్ళెం వేశారు. మీడియాకు ‘విక్టరీ’ సింబల్’‘తో ఫోజిచ్చిన కేసీఆర్’ను వారించి, ఇల్లలకగానే పండగ రాదని’ గుర్తు చేశారు. ముందుంది ముసళ్ళ పండగ అని గుర్తు చచేస్తూ పోరాటానికి సిద్దం కమ్మని అందుకు గుర్తుగా ‘పిడికిలి’ బిగించి చూపించారు.
http://www.teluguone.com/news/content/post-politics-after-kcr-mumbai-tour-25-132060.html





