జగన్‌తో భేటీకి అపాయింట్మెంట్.. ఇంతలోనే విషాదం
Publish Date:Feb 21, 2022
Advertisement
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గౌతమ్ రెడ్డి మరణంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి వారం రోజుల పాటు దుబాయ్ లో పర్యటించి వచ్చారు. ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్ ప్రభుత్వం దుబాయ్ ఎక్స్ పో వేదికగా పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ ఎంఓయూలు చేసుకుంది. దుబాయ్ పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం గౌతమ్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం కలిసేందుకు గౌతమ్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ కీలక భేటీలో దుబాయ్ పర్యటనకు సంబంధించిన వివరాలు సీఎంకు వివరించాలని మేకపాటి అనుకున్నారు. భేటీ తర్వాత అమరావతిలోనే మేకపాటి ప్రెస్ మీట్ కూడా నిర్వహించాలని భావించారు. అయితే ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దుబాయ్ పర్యటన ద్వారా ఏపీకి గౌతమ్ రెడ్డి రూ. 5,015 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని సమాచారం. సోమవారం ఉదయం తనకు గుండెనొప్పిగా ఉందని గౌతమ్ రెడ్డి తన సతీమణికి చెప్పారు. దాంతో గౌతమ్ రెడ్డిని కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. గౌతమ్ రెడ్డి ఎలాగైనా బ్రతికించాలని డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గౌతమ్ రెడ్డి మరణానికి పోస్ట్ కోవిడ్ పరిణామాలే కారణమని తెలుస్తోంది. మేకపాటి మరణించారని తెలుసుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక మంది రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
http://www.teluguone.com/news/content/gautham-reddy-take-appointment-to-meet-ys-jagan-25-132057.html





