పొత్తుల్లో పెడధోరణి!
Publish Date:Apr 2, 2014
Advertisement
దేశంలో రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి. రాజకీయ నాయకులు ఇంకా దారుణంగా తయారయ్యారు. ఈ రెండు శక్తుల కాంబినేషన్‌లో నడుస్తున్న పొత్తుల ప్రక్రియ మరింత దారుణంగా తయారైంది. ఈసారి ఎన్నికలలో పొత్తుల ఎత్తులు, జిత్తుల్లో పొడచూపుతున్న పెడ ధోరణులు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగనట్టు వున్నాయి. పొత్తుల అంశాన్ని ఇంత కంగాళీ చేసి జనాన్ని లేనిపోని కన్ఫ్యూజన్‌కి గురి చేస్తున్నారు. ఈ అంశంలో ఏ పార్టీ మీద అమాయకపు ముద్ర వేయడానికి వీల్లేదు. తిలాపాపం తలా పిడికెడన్నట్టు అన్ని పార్టీలూ ఇందులో భాగస్వామిగానే వున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న సీపీఐ తనకేదో ప్రజల్లో ఓట్లు తెగ పడిపోతాయన్నట్టుగా సీట్లు బేరమాడుతూ వుంటుంది. తాను గెలవనని తెలిసినా సీట్లు డిమాండ్ చేస్తూ వుంటుంది. తాను అడిగిన సీట్లు ఇవ్వకపోతే పొత్తు కటీఫ్ అంటుంది. తనతోపాటు కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కూడా పొత్తు పెట్టుకుంటే తనకి లాభం అని ఆశపడుతూ వుంటుంది. ఒకపక్క కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకదాన్నొకటి తిట్టుకుంటూ వుంటే, తాను మధ్యలో దూరి పరిష్కారం చేస్తానని లేనిపోని పెద్దరికాన్ని నెత్తిన వేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ విషయానికి వస్తే టీఆర్ఎస్ విలీనం లేదు పొమ్మనడంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌తో పొత్తుల బేరం పెట్టింది. అది కూడా వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నిరాశకి గురైంది. టీఆర్ఎస్ ఛీ కొడుతున్నా పొత్తు కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతూ వుంటుంది. కాంగ్రెస్ నాయకులు ఉదయాన్నే టీఆర్ఎస్‌ని తిడతారు. సాయంత్రం ఆ పార్టీతో పొత్తు వుంటే బాగుంటుందని ప్రశాంతంగా మాట్లాడతారు. ఇక టీఆర్ఎస్ చూపంతా బీజేపీ పైనే. తెలుగుదేశంతో బీజేపీకి పొత్తు కుదరకపోతే తాను ఆ ప్లేస్‌లో దూరేయాలని టీఆర్ఎస్ తహతహ. బీజేపీతో తెలుగుదేశం పొత్తు కుదిరితే అప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు గురించి ఆలోచించాలని ప్రణాళిక. ఇక తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఒక పట్టాన తేలకుండా సాగుతూ చిరాకు తెప్పిస్తోంది. తెలుగుదేశం ఎంత తగ్గినా బీజేపీ ఓవర్ యాక్షన్ చేస్తోంది. కొంతమంది బీజేపీ నాయకులు టీడీపీతో పొత్తు వుండదంటారు. మరికొందరు పొత్తు వుంటుందంటారు. ఈ రెండుపార్టీల మధ్య పొత్తు కుదరకపోతే తాను రంగంలోకి దిగి బీజేపీని మంచి చేసుకోవాలని వైఎస్సార్సీపీ కాచుకుని కూర్చుంది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరదు గాక కుదరదంటూ తన మీడియా ద్వారా ఊదరగొట్టేస్తూ వుంటుంది. ఈ అయోమయ పరిస్థితికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఏంటో!
http://www.teluguone.com/news/content/poll-alliance-37-31922.html





