బొద్దింకలకు జగన్ మద్దతు: వ్యూహాత్మకమా.. బీజేపీతో తెగతెంపులా.?
దేశ రాజకీయాలలో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు, యువత సమస్య పరిష్కారం డిమాండ్ తో ఆ పార్టీ చేపడుతున్న ఆందోళనలు, ఉద్యమాలకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అయితే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సీజేపీకి మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ) జ్ఞానేశ్ కుమార్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు జగన్ మద్దతు పలికారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్ , అశుతోష్ రాంకా తదితరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రైవేట్ ప్రాంగణాల ద్వారా నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు వారిపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 19 వరకు 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తీహార్ జైలుకు తరలించారు. ఈ అరెస్టులను వైసీపీ అధినేత జగన్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ మద్దతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మళ్లీ పునరుద్ధరించబడాలని, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులు సమస్యను పరిష్కరించలేవని జగన్ సామాజిక మాధ్యవ వేదికగా షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ సీజేపీకి మద్దతు పలకడం వ్యూహాత్మకమా? లేక బీజేపీతో తెగతెంపులకు సంకేతమా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. జగన్ బొద్దింకలకు మద్దతుగా సామాజిక మాధ్యమ వేదికగా మద్దతు పలకడాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఎద్దేవా చేశారు. ఈడీ , సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ ఏపీలో అధికారంలో ఉన్న కాలంలో జరిగిన అరాచకాలు, హింసాత్మక ఘటనలను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా తగిన సమయంలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని మాధవ్ హెచ్చరించారు. [YS Jagan upport Cockroach Janta Party, Condemn CJP Leaders Arres, YCP Political Strategy, Election Commission India, Telugu One]
Published on: Fri Oct 16, 2026 9:50AM