సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఎందుకీ దిగజారుడు రాజకీయాలు?
Publish Date:Feb 14, 2022

Advertisement
రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు కామన్. కానీ, ఈమధ్య కొందరు నేతలు మరీ దిగజారిపోతున్నారు. నీచాతినీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బండబూతులు మాట్లాడుతూ సభ్య సమాజానికి అసభ్య మెసేజ్ ఇస్తున్నారు మరికొందరు. ఇప్పటికే ఏపీ మంత్రి కొడాలి నాని బూతుల మంత్రిగా ముద్రపడగా.. ఇక అసెంబ్లీలో నారా భువనేశ్వరిని ఉద్దేశించి అసంబద్ధ వ్యాఖ్యలు చేసి మరింత దిగజారిపోయారు వైసీపీ నేతలు. అదే కోవలో.. తాజాగా రాహుల్‌గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ దారుణ కామెంట్లు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇలాంటి నోటిదూల నేతల తీరుపై తీవ్ర చర్చ రచ్చ నడుస్తోంది.
రాహుల్‌గాంధీ తండ్రి ఎవరని తామెప్పుడైనా అడిగామా? ఇదీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న హిమంత చేసిన పనికిమాలిన ప్రేలాపన. అందుకే, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ సైతం అలాంటి కామెంట్లను తీవ్రంగా తప్పుబట్టారు. ఆ క్రమంలో ఓ విలేకరి ప్రశ్నకు బదులిస్తూ.. ఏపీ అసెంబ్లీలో నారా లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలనూ తాను పూర్తిగా ఖండిస్తున్నట్టు.. అలాంటి చెత్తవాగుడు ఎవరు వాగినా అది తప్పేనంటూ ఖరాఖండిగా చెప్పేశారు. సీఎం కేసీఆరే కాదు.. సభ్యత ఉన్న ఏ మనిషైనా అలాంటి మాటలను ఖండిస్తారు. ఆనాడు ఏపీ అసెంబ్లీలో అలా నోటికొచ్చినంత వాగిన తన ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలవడం, విషయాన్ని పక్కదారి పట్టించిన విధానం జగన్‌రెడ్డికి సబబుగా ఉందేమో కానీ సభ్య సమాజంలో ఎవరూ ఆ దారుణాన్ని హర్షించలేదనేది వాస్తవం.
ఇక, అసోం సీఎంకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు రేవంత్‌రెడ్డి. మీరు చైనా వారికి పుట్టారని మేము కూడా అనగలమంటూ.. అసోం ముఖ్యమంత్రికి ఆయన భాషలోనే గట్టి జవాబివ్వడం టిట్ ఫర్ టాట్ అంటున్నారు. అంతేనా. ఇక ఇంతేనా. ఇలా అనుకుంటూ పోదామా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఆనాడు నారా లోకేశ్ పుట్టుక గురించి నిండు సభలో నీచంగా మాట్లాడారు వైసీపీ సభ్యులు. ఇప్పుడు రాహుల్‌గాంధీపై నోరుపారేసుకున్నారు బీజేపీ నేత. లోకేశ్‌పై అయినా, రాహుల్‌నైనా.. అలాంటి పిచ్చికూతలు కూయడం దారుణమే. రాజకీయంగా దిగజారుడుతనమే. చేయాలంటే ఎన్నో విమర్శలు చేయొచ్చు.. కానీ, ఇలా వారి పుట్టుకనే శంకిస్తూ చెత్తవాగుడు వాగడం మాత్రం అసలేమాత్రం సరికాదంటున్నారు.
తల్లి నిజం. తండ్రి నమ్మకం. రాజకీయ ప్రయోజనాలకోసం ఆ నమ్మకాన్నే ప్రశ్నించడం మాత్రం ఘోరం. దారుణాతిదారుణం. రాహుల్ ఎపిసోడే తీసుకుంటే.. ఆయన అచ్చం తన తండ్రి రాజీవ్‌లానే ఉంటారు. ప్రియాంక ఇందిరలా ఉంటుందంటారు. రాహుల్ రాజీవ్ కొడుకనడంలో ఎవరికీ ఎలాంటి డౌట్ ఉండదు. మరి, ఆ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొన్న ఆ బీజేపీ వాడికి ఆమాత్రం ఇంగితం కూడా లేదా? అంటూ మండిపడుతున్నారంతా. సేమ్ టూ సేమ్.. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ విషయంలోనూ అంతే. అసెంబ్లీలో దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేశారు ఆ నలుగురు వైసీపీ నాయకులు. అంతకుముందే లోకేశ్ డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ వల్లభనేని వంశీ కారుకూతలు కూశాడు. ఆ అసహ్యాన్ని కంటిన్యూ చేస్తూ.. అసెంబ్లీలోనూ లోకేశ్ పుట్టుక గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారు కొడాలి నాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. తన కొడుకు, భార్యను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని విని తట్టుకోలేకపోయారు చంద్రబాబు. కురుసభలాంటి ఈ అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టనని శపథం చేశారు. బయటకొచ్చి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. ఆయన కంట కన్నీరు చూసి.. మహిళలంతా ఆ అవమానం తమకే జరిగినట్టు బాధపడ్డారు. వైసీపీ నేతలకు శాపనార్థాలు పెట్టారు. ఆ పాపం.. ఆ శాపం.. ఎప్పటికైనా జగన్ అండ్ కో కు తగలకమానదంటున్నారు. అయినా, తమ సభ్యులు మాట్లాడిన మాటలను వెనకేసుకురావడం జగన్‌రెడ్డికే చెల్లింది. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
రాహుల్ అయినా, లోకేశ్ అయినా.. అసలెందుకు ఇలాంటి నీచ ఆరోపణలు? అనేది చర్చనీయాంశం. రాజకీయ వైరం ఉంటే.. విధానాలను విమర్శించండి.. అక్రమాలు, అన్యాయాలు, అవినీతి చేస్తే ఆరోపణలు చేయడం.. అంతేగాని ప్రత్యర్థుల పుట్టుకను అనుమానించడమేంటి? తల్లిని అవమానించడమేంటి? రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారా ఈ నేతలు? ఇలాంటి కారుకూతలు కూస్తూ.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించని బీజేపీ నేతలను ఏమనాలి? నారా లోకేశ్‌పై అలా మాట్లాడిన వైసీపీ నాయకులను వెనకేసుకొచ్చిన జగన్‌రెడ్డిని ఏం చేయాలి? అంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్లు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డి భాషలో చెప్పాలంటే.. లోకేశ్ గురించి అలా మాట్లాడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడిలు ఎవరికి పుట్టారని అడిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఆ బాధను ఫీల్ అవండి.. అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. సభ్య సమాజానికి ఇలాంటి మెసేజ్‌లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/political-controversy-over-rahul-and-lokesh-issues-25-131760.html












