సమతామూర్తి సాక్షిగా వివక్ష.. చినజీయర్‌పై విమర్శ..
Publish Date:Feb 14, 2022
Advertisement
నిజమే. శ్రీ రామానుజాచార్యులు ‘సమతా’ మూర్తి, సందేహం లేదు. వెయ్యేళ్ళ క్రితమే ఆయన కుల మత తారతమ్యాలు లేని సమాజ వ్యవస్థ కోసం కలలు కన్నారు. శ్రీ రామానుజులు సమతామూర్తి మాత్రమే కాదు. మనుషులంతా ఒక్కటే అని నమ్మిన మానవతామూర్తి. సమతా మంత్రాన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ సమానంగా పంచిన మేరునగ సమోన్నత సమతా శిఖరం శ్రీ రామానుజాచార్యులు.అంతటి మహనీయుని, సహస్రాబ్ది ఉత్సవాలను చిన జీయర్ స్వామి, హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్’లో ఘనంగా నిర్వహించారు. శ్రీరామనగర్‌లో వందెకరాల ప్రాంగణంలో అద్వితీయ రీతిలో సమతామూర్తి విగ్రహాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించారు. ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు. వేలాదిగా భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, 12 రోజులపాటు ఇంత వైభవంగా జరిగిన వేడుకలలో సమతా మూర్తి శ్రీరామానుజుల మూల సూత్రమే మరుగున పడిపోయిందని ఉత్సవాలలో పాల్గొన్న, తిలకించిన భక్తులు అవేదన, ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. శ్రీరామనుజుల వారు మనుషులు అందరినీ సమానంగా చూడాలన్నారు. అనడం కాదు ఆచరించి చూపారు. అందుకే ఆయన సమతామూర్తి అయ్యారు. వెయ్యేళ్ళు అయినా ఇంకా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచారు. ఆ ప్రేరణతో ఎందరో చేసిన సమర్పణలతోనే ఆధ్యాత్మిక సమతా కేంద్ర నిర్మాణం జరిగింది. అయితే, ఆయన శ్రీ రామానుజుల ఆశయాలను ముందుకు తీసుకు పోతున్నామని చెప్పు కుంటున్న చిన జీయర్ స్వామి, అందరిని సమానంగా చూశారా? పంక్తిలో వలపక్షం చూపారా? అంటే, కొందరిని ఒకలా, ఇంకొందరిని ఇంకోలా చూశారనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. స్వామీజీ, అతిధులకు తీర్థ, ప్రసాదాలు ఇచ్చే సమయంలో.. అయిన వారికి ఆకుల్లో, కానీ వారికి కంచాల్లో అనట్లుగా పక్ష పాతాన్నిమ వివక్షను చూపారని భక్తులు అవేదన వ్యక్తం చేశారు. నిజానికి చిన జీయర్ స్వామి ఎవరినీ ముట్టుకోరని, ఎవరినీ దగ్గరకు కూడా రానీయరనే ఆరోపణ లేదా నింద ఉండనే వుంది. అయితే అందుకు ఆయన కొంత వివరణ కూడా ఇచ్చారు. ఏవో కారణాలు చెప్పారు. అయినా అదొక మచ్చగానే మిగిలి పోయింది. అదలా ఉంటే, ఇంతటి వేడుకల్లోనూ వివక్ష చూపడం ఏమిటనే, ప్రశ్న ప్రముఖంగా వినవస్తోంది. అందరి విషయంలో ఒకేలా ఉంటే అదో రకం, కానీ, ఒకే వేదిక పై కొందరిని ఒకలా ఇంకొందరిని ఇంకొకలా చూడడం వలన, సమతా మూర్తి సన్నిధిలోనే వారి సందేశానికి అవమానం జరిగిందనే బాధను భక్తులు వ్యక్త పరుస్తున్నారు. నిజానికి, గతంలో స్వామీజీ కొన్ని వర్గాల ప్రజల ఆహారపు అలవాట్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. స్వామీజీ కుల వివక్ష చుపుతున్నారనే ఆరోపణలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు, ఏకంగా మహా వేడుకలో, కడివెడు పాలలో ఒక్క విషం చుక్కలా సమతా మూర్తి సాక్షిగా, స్వయంగా చిన జీయర్ స్వామి అసమానతలు, వివిక్ష చుపారనే ఆరోపణలు వినవలసి రావడం అంతోటి స్వామికి జరిగిన అవమానంగానే భావించవలసి ఉంటుదని భక్తులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/comments-on-chinna-jeeyar-swamy-25-131756.html





