సమారోహణం ముగిసింది.. రచ్చ కొనసాగుతోంది..
Publish Date:Feb 14, 2022

Advertisement
శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహణ కార్యక్రమం ముగిసింది. రెండు వారాల పాటు వైభవంగా జరిగిందీ క్రతువు. ముచ్చింతల్‌కు మహామహులే తరలివచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్, ప్రధాని మోదీల నుంచి అనేకమంది ప్రముఖులు, లక్షల సంఖ్యలో సామాన్యులు విచ్చేశారు. సమతామూర్తిని దర్శించుకుని.. రామానుజుల దివ్య చరితను, ఆయన పంచిన స్పూర్తిని స్మరించుకున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీతో హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ దర్శనాస్థలం అందుబాటులోకి వచ్చింది. అంతా బాగుంది. ఆ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కానీ, సీఎం కేసీఆర్ తీరు.. ఆ ఆధ్యాత్మిక శోభకు దిష్టిచుక్కలా మారిందనే విమర్శ వచ్చింది.
ఊరంతా ఒకవైపు.. కేసీఆర్ ఒక్కరు ఒకవైపు.. అన్నట్టు ఉంది వ్యవహారం. రాజకీయాలు ఉంటే పొలిటికల్ డయాస్‌పై చూసుకోవాలి..తేల్చుకోవాలి. అంతేకానీ, ఇలాంటి అపురూప ఆధ్యాత్మిక కార్యక్రమంలో కిరికిరి పెట్టడం కేసీఆర్‌కే చెల్లిందంటూ అంతా ఆయన తీరును తప్పుబడుతున్నారు. మోదీ దేశ ప్రధాని. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. పీఎం వస్తే సీఎం ఎదురెళ్లి స్వాగతం పలకడం ప్రొటోకాల్. కానీ, రాజుకంటే బలవంతుడననే భ్రమలో ఉండే కేసీఆర్.. రామానుజుల చెంతనే.. తన రాజకీయం ప్రదర్శించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్వరం అంటూ సాకులు చెప్పి.. ముచ్చింతల్‌లో ప్రధాని మోదీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. యావత్ దేశం ముందు తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీశారని మండిపడుతున్నారు. అదే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ వస్తే.. విమానాశ్రయంలో వెల్‌కమ్ చెప్పారు కానీ.. ముచ్చింతల్‌లో మాత్రం ఆయన వెంట లేకుండా వెళ్లిపోయారు. ఇలా, దేశ అత్యున్నత రాజ్యాంగ హోదాలో ఉన్న ప్రెసిడెంట్, పీఎంలతో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది.
కేసీఆర్ ఎందుకలా చేసినట్టు? ఎందుకింతలా పంతానికి పోయినట్టు? కేంద్ర బడ్జెట్ తర్వాత కేంద్రాన్ని, మోదీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు కేసీఆర్. అన్నేసి మాటలు అనేశాక.. మళ్లీ మోదీ ముందుకు వెళ్లి దండం పెట్టడం ఇష్టం లేకే.. జ్వరం సాకుతో ముఖం చాటేశారని అంటున్నారు. కేసీఆర్ కాదన్నా.. ఇదే నిజం అని అందరికీ తెలిసిందే. మరి, రాష్ట్రపతి వెంటైనా కార్యక్రమం ఆసాంతం ఉండొచ్చుగా? ఆయనేతో ఈయనకు ఏం గొడవ లేదుగా? కేసీఆర్ దొరతనం వల్లే అలా దేశ ప్రధమ పౌరుడిని పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. గంటల తరబడి ప్రెస్‌మీట్లు పెట్టే ఓపిక ఉన్న కేసీఆర్.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితో కొన్నిగంటల సమయం గడిపేందుకు మాత్రం తీరిక లేదా? అని నిలదీస్తున్నారు.
ఇక, చినజీయర్‌స్వామితో, మైహోం రామేశ్వర్‌రావుతోనూ కేసీఆర్‌కున్న మంచి సంబంధాలు బాగా చెడిపోయాయని అంటున్నారు. మోదీ ఆవిష్కరించిన సమతామూర్తి శిలాఫలకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేదని.. గులాబీ బాస్ బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. తాను అంత సహాయం చేస్తే.. కనీసం శిలాఫలకం మీద తన పేరైనా వేయరా? అంటూ చినజీయర్‌పై అక్కస్సుతో ఉన్నారని అంటున్నారు. మైహోం రామేశ్వర్‌రావుకు ప్రభుత్వం తరఫున అంత సహాయసహకారాలు అందిస్తుంటే.. అన్నీ చూసుకుంటున్న ఆయన తనకు మాత్రం సరైన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వలేదని కేసీఆర్ గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే, రాష్ట్రపతి వచ్చినప్పుడు ఆయన వెంట వెళ్లకుండా.. వెల్‌కమ్ చెప్పి వెనక్కి వచ్చేశారని అంటున్నారు.
చినజీయర్ పదే పదే మోదీని, అమిత్‌షాను, బీజేపీని పొగడ్తలతో ముంచెత్తడంతో కేసీఆర్ ఇగో హర్ట్ అయిందని కూడా అంటున్నారు. యాదాద్రికి చినజీయర్‌ను ముందుంచితే, ఆయన చెప్పినట్టే యగ్ఞయాగాదులు చేస్తుంటే.. ముచ్చింతల్‌కూ ప్రభుత్వ తరఫున ఫుల్ సపోర్ట్ చేస్తే.. తానింతా చేస్తే.. స్వామీజీ మాత్రం తనకు కాకుండా మోదీని, బీజేపీని తెగ పొగిడేయడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారనేది ఆయన సన్నిహితులు మాట. ఇక, మైహోం రామేశ్వర్‌రావుకూ చెక్ పెట్టే పని ఇప్పటికే మొదలెట్టేశారని కూడా తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ఎంతో వేడుకగా జరిగిన శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహణ కార్యక్రమాన్ని.. సీఎం కేసీఆర్ ఇలా రాజకీయ వేదికగా మారడాన్ని మాత్రం అంతా తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఆ వేడుక ముగిసింది. రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతోంది. దేశంలోకే బలమైన మోదీ.. తనను కేసీఆర్ కేర్ చేయకపోవడాన్ని సహించగలరా? సరైన సమయంలో కేసీఆర్‌కు సరైన విధంగా బుద్ధి చెప్పకుండా ఉంటారా? అసలే మోదీ.. ఏమైనా చేయగలరు...అంటున్నారు.
http://www.teluguone.com/news/content/controversy-over-cm-kcr-at-statue-of-equality-25-131767.html












