పోలవరం మరో అమరావతేనా?.. ప్రాజెక్టు కథ ముగిసినట్లేనా?
Publish Date:Apr 24, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం కథ ఇంక ముగిసిందా? ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఉద్దేశానికి జగన్ సర్కార్ తిలోదలాకిచ్చేసిందా? అన్న ప్రశ్నకు ఏపీ కొత్త జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమని అనుకోవలసి వస్తుంది.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న విషయాన్ని తాను చెప్పలేనని కుండ బద్దలు కొట్టేశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందనీ, అది ఏ స్థాయిలో దెబ్బతింది, దానిని ఎలా మరమ్మతు చేయాలి, ఎంత వ్యయం అవుతుంది ఇత్యాది విషయాలన్నీ పరిశీలించిన తరువాతే పోలవరం పురోగతిపై ఒక నిర్ణయానికి రాగలమని అంబటి చెప్పారు.
మూడేళ్లుగా పోలవరాన్ని మూలనపడేసి ఇఫ్పుడు గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్లే పోలవరం పరిస్థితి ఇలా తయారైందని అన్నారు. ఈ విషయంలో పోలవరం నిర్మాణంలో భుజకీర్తుల కోసం చంద్రబాబు పడిన తాపత్రయమే ఈ పరిస్థితికి కారణమని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలవనరుల శాఖ అనుమతులతోనే పనులు జరిగాయి కదా అన్న విలేకరుల ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేశారు. మీ ప్రశ్నలకు నేను జవాబివ్వడం కాదు...నేను చెప్పింది మీరు రాసుకోండంటూ అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి గత మూడేళ్లుగా జరగాల్సి మట్టి పని నిలిచిపోవడ వల్లనే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతుండగా.. మంత్రి అంబటి రాంబాబు మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపించారు.
డయాఫ్రం వాల్ ఏ స్థాయిలో దెబ్బతిందన్న అంశం తేలాకే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తేలుతుందని అన్నారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన స్థలంలో గుంతలు పడ్డాయన్న ఆయన అక్కడి నీటిని తోడేయడానికి రెండు వేలకు పైన వ్యయమౌతుందని విరించారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే...ఇప్పటి వరకూ డయాఫ్రం వాల్ ఎంత మేర దెబ్బతింది అన్న విషయంపై నిపుణుల కమిటీ నివేదికే ఇవ్వలేదు. ఇక నీటిని తోడేయడానికి ఎంత వ్యయం అవుతుందన్న విషయంపై రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు చెబుతున్న అంకెకు, అంబటి చెప్పిన అంకెకూ పొంతనే లేదు. అసలు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు పోలవరం ప్రాజెక్టుతో సంబంధమే లేదన్నట్లుగా అంబటి వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ పోలవరం అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పోలవరం సందర్శన అయితే పూర్తయ్యింది కానీ ఇంకా నివేదిక ఇవ్వలేదు. నివేదికకు ముందే నష్టం ఇంత, ఖర్చు ఇంత అంటూ అంబటి విలేకరుల సమావేశంలో ప్రకటించడాన్ని బట్టి నివేదిక కేవలం నామమాత్రమేననీ, భారీ వ్యయం బూచి చూపి పొలవరం ఎత్తు తగ్గించి చాపచట్టేయడమో లేదా మూడు రాజధానుల పేరు చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసిన చందంగా పోలవరం పనులకు ఫుల్ స్టాప్ పెట్టేయడమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.
ఇక జల రంగ నిపుణులైతే...నీటిని తోడడానికి అంత భారీ వ్యయం అవసరం లేదనీ, డయాఫ్రం గోడలను కొద్ది పక్కకు జరిపితే నీరు దానంతటదే దిగువకు వెళ్లిపోతుందనీ చెబుతున్నారు.
దేశంలో దాదాపుగా పోలవరమే చివరి బహుళార్థక ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టు విషయంలో రాజకీయం చేస్తూ వైఫల్యాలకు ప్రత్యర్థి పార్టీలను నిందిస్తూ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా ప్రభుత్వమే ప్రయత్నాలు చేయడం పట్ల జల వనరుల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతున్న మంత్రి దానికి సరిచేయడానికి మూడేళ్లలో ప్రభుత్వం ఎందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదనడానికి మాత్రం స్పష్టమైన జవాబు ఇవ్వడం లేదు.
అమరావతి విషయంలో ఎలా అయితే...అమరావతే రాజధాని అంటూ తొలుత ప్రకటనలు గుప్పించి, ఆ తరువాత దానిని నిర్వీర్యం చేశారు.ఏపీ జీవ ప్రదాయిని అంటూ కొనియాడిన పోలవరం పురోగతిని ఉద్దేశ పూర్వకంగా ఆపేసి జగన్ సర్కార్ చోద్యం చూస్తోందని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/polavaram-another-amarawati-25-134886.html





