ఏపీ సర్కార్ కు కేంద్రం చురకలు.. ఇలా అయితే ఇంతే సంగతులు
Publish Date:Dec 11, 2021
.webp)
Advertisement
'ఆంధ్ర ప్రదేశ్ లో చాలా చిత్రమైన పరిస్థితినెలకొంది’. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్య వినేందుకు ఇబ్బందిగా ఉన్నా కాదనలేము. ఇప్పటికే అందరికీ అర్ధమైన అక్షర సత్యం. నిజానికి ఇదొకటే కాదు కేంద్ర మంత్రి మరో ముచ్చటైన మాట కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధత కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఉదాహరణలతో సహా వివరించారు.
వివరాలోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టిన పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక నగరాల ఏర్పాటు పరిస్థితి ఏంటి ?ఎంతవరకు వచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు,టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు, మంత్రి సవివరంగా సమాధాన మిచ్చారు. ఈసందర్భంగా, ఆయన చేసిన వ్యాఖ్యలు, అభివృద్ధి విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వింత పోకడలను బయట పెట్టాయి. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఓర్వకల్లు నోడ్‌ను 10వేల ఎకరాలతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రెండుగా విభజించి అందులో సగం భూమి మాత్రమే ఇస్తాం, మిగతాది తామే అభివృద్ధి చేసుకుంటామని చెబుతోందని పేర్కొన్నారు.
ఇక్కడే కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ధోరణిని పరోక్షంగానే అయినా తప్పు పట్టారు, చిన్న చిన్న ప్రాజెక్టులకు పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం అయ్యేపని కాదు. ఈ విషయం ఆర్థిక శాస్త్రంలో ఓనమాలు రాని వారికి కూడా తెలుసు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కొంచెం సుతిమెత్తగా చెప్పారు. మొత్తం 9,800 ఎకరాలు సేకరించాలని ఉద్దేశించిన హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్’ ను రెండు ముక్కలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన చిత్రంగా ఉందని అన్నారు. నోడ్ అభివృద్ధికి 4,742 ఎకరాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నోడ్ అభివృద్ధి కోసం ఇంతవరకే గుర్తించినట్లు చెబుతోంది. చిన్న ప్రాజెక్టులకు పెద్ద పరిశ్రమలను ఆహ్వానించడం చాలా కష్టం.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. అప్పుడే ఇలాంటి ప్రాజెక్టులను వేగంగా చేపట్టడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి, వరస పెట్టి వాతలు పెట్టారు.
ఓర్వకల్లు నోడ్‌లో పారిశ్రామిక కారిడార్‌కు కేటాయించిన భూమి పక్కన 4,500 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ మౌలిక వసతులతో సొంతంగా పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ చాలా చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ 10వేల ఎకరాలతో ఒక ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించి, ఇప్పుడు దాన్ని రెండు భాగాలుగా కోసి అందులో మీకు సగమే ఇస్తాం, మిగతా సగం మేం సొంతంగా అభివృద్ధి చేసుకుంటాం అంటున్నారు. రెండింటిలో మౌలికవసతులు భిన్నం. ఇక్కడ పనుల డూప్లికేషన్ జరగనుంది. ఇప్పుడు రెండు పారిశ్రామిక ప్రాజెక్టుల మధ్య పోటీ నెలకొంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని తొలుత ప్రతిపాదించినట్లుగానే సమీకృత ప్రాజెక్టుగా మార్చడానికి ప్రయత్నించాలని కోరుతున్నా' అని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.అలాగే, కృష్ణపట్నం నోడ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన టెండరింగ్ ప్రక్రియపై కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అయినా రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకున్నప్పుడే అది సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అలాంటి సమర్ధ చర్యలు ఏపీ ప్రభుత్వం తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పారు.
ఒక ప్రాజెక్టుకు సంబదించి భూసేకరణతో పాటు, ఆ భూమి అంతా ఒకేచోట ఉండేలా చూసినప్పుడే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయన్న కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మరో చురక అంటించారు. ఇందుకు ఉదాహరణగా, చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం నోడ్‌ని అవసరమైన 2,500 ఎకరాల భూమిలో ఇప్పటివరకు 2,091 ఎకరాలు సేకరించారు. ఇది మంచి పరిణామం. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పనుల కోసం కాంట్రాక్టరును నియమించాలి. కేంద్రం ఈ విషయాల్లో జోక్యం చేసుకోదు. కాంట్రాక్టరు నియామకానికి ఉత్తమ టెండరింగ్ ప్రక్రియను అనుసరించాలి. ప్రస్తుతం వారి టెండరింగ్ ప్రక్రియపై చాలామంది కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసిందని, గోయల్ చెప్పారు.
అంటే రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనిసరిస్తున్న పోకడలు చిత్ర, విచిత్రంగా ఉన్నాయని కేంద్ర మంత్రి గోయల్ స్పష్టం చేశారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ళ పాలనలో ... ఒక్క పారిశ్రామిక విధానం మాత్రమే కాదు ... ఏ రంగాన్ని, ఏ విధానాన్ని చూసినా ఇలాగే షాక్ కొడుతుందని అధికారులే అంటున్నారు. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో ఆర్థిక నిపుణులూ ఇదే చెపుతున్నారు. అయితే, వైసీపే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు.
http://www.teluguone.com/news/content/piyush-goel-hot-comments-on-ap-jagan-govt-25-128142.html












