సొంత బిడ్డ, అల్లుడి ఫోన్లను ట్యాప్ చేసిన నీచ సంస్కృతి వారిది : బండి సంజయ్
Publish Date:Dec 23, 2025
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తనతో పాటు పలువురు అగ్ర నేతల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. ఆఖరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచమైన చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్న ఎస్ఐబీ వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టుపట్టించారని ఆరోపించిన బండి సంజయ్, ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా? అన్నది అనుమానంగానే ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారే తప్ప, గట్టి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి ప్రారంభమైన టీవీ సీరియల్ ఎపిసోడ్‌లు కూడా పూర్తయ్యాయని, కానీ ఈ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విచారణాధికారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బులు దండుకున్న వ్యవహారంపై కూడా నిగ్గు తేల్చాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/phone-tapping-case-36-211448.html





