అవినీతి ‘ద్వారం’ పూడి ఆటకట్టినట్టేనా?
Publish Date:Nov 29, 2024
Advertisement
కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రావాణాతో కోట్లు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంత కాలం ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాము అధికారంలోకి వస్తే పోర్టు మాఫియాను కూకటి వేళ్లతో పెకలించేస్తామనీ, అవినీతి ‘ద్వారం’పూడి ఆటకట్టిస్తాననీ శపథం కూడా చేశారు. అటు ద్వారంపూడి కూడా పవన్ కల్యాణ్ ని అనుచితంగా దూషిస్తూ పరుష వ్యాఖ్యలు కూడా చేశారు. సరే ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ సర్కార్ పతనమైంది. వైసీపీకి కనీసం విపక్ష హోదా కూడా రాలేదు. అత్యంత అవమానకర రీతిలో 175 స్ధానాలకు గానూ కేవలం 11 స్థానాలలోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాకినాడ నుంచి ద్వారం పడి చంద్రశేఖరరెడ్డి ఘోర పరాజయాన్ని చవి చూశారు. తెలుగుదేశంకూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమరవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్నీ సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫీయా కొంత కాలం సైలెంట్ అయిపోయింది. ఈ మాఫియా డాన్ ద్వారంపూడే అన్నది అందరికీ తెలిసిన విషయమే. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లే వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించిన ద్వారం పూడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలను బట్టి అవగతమౌతోంది. మూడు రోజుల కిందట వేల టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడను పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోనిక దిగడంతో అవినీతి ద్వారంపూడి ఆటకట్టినట్లేనని అంటున్నారు. బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మూసేసి, ఇక కేంద్రం అధీనంలోని పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి అనకొండల ఆటకట్టించడానికి కంకణం కట్టుకున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో కాకినాడలో ద్వారంపూడికి సహకరిస్తున్న అధికారులనూ వదిలేది లేదని హెచ్చరించారు. స్థానిక అధికారలు అండదండలు, సహాయసహకారాలూ లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టుకు ఎలా చేరిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
http://www.teluguone.com/news/content/pawan-check-to-dwarampudi-corruption-39-189235.html





