నా దండు కప్పల దండు.. నాతో పెట్టుకోవద్దు!
Publish Date:Jun 17, 2022
Advertisement
ఇంట్లో పిల్లలతో పాటు కుక్కపిల్లనో, పిల్లినో పెంచుకోవడం చాలా మందికి అలవాటు. అదో సరదా! వాటి సంరక్షణను ఎంతో జాగ్రత్తగా చేపడుతుంటారు. వాటిని ఇంట్లోని సొంత మనుషుల్లాగే, కుటుంబ సభ్యుల్లాగే ప్రేమగా చూసుకుంటుంటారు. పూర్వం గుర్రాలనూ, పులులనూ కూడా పెంచుకునే వారని విన్నాం. ఎవరయినా కప్పల్ని పెంచేవారుంటారా? ఎన్నడైనా కనీ వినీ ఎరుగుదుమా? కానీ ఇదుగో నేనున్నానంటూ ఒకాయన ఈమధ్యే టిక్ టాక్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. ఆ మహానుభావుడు ఎవరో గాని లోకంలో మరేదీ దొరకనట్టు ఏకంగా 1.4 మిలియన్ల కప్పల్ని అంటే ఓ పెద్ద కప్పల దండును పెంచి పోషిస్తున్నాడు! అసలు కప్పల బెక బెకలు వినడమే కష్టం. నీళ్లలోంచి నేల మీదకి, నేలమీద నుంచి నీళ్లలోకి అలా గెంతుతూ ఆడుతూ బెక బెక మంటూ మహా చికాకు కలిగిస్తుంటాయి. వాటిని చూస్తే ఎప్పుడు మీదకు దూకుతాయోనని భయంతోనో, ఆసహ్యంతోనో ఒళ్లు జలదరింపూ వుంటుంది. అలాంటిది ఆయన ఏదో దేశానికి సైన్యం తయారు చేసుకున్నట్టు, ఫుట్ బాల్ జట్లకు శిక్షణ ఇస్తున్నట్లు కప్పల్ని పెంచి పోషించడం నిజంగా విడ్డూరమే! ఈ కప్పల దండును తన తోటలో పెంచుతున్న పెద్దమనిషి వాటి మీద ప్రేమ గురించి మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో కప్ప గుడ్లు జాగ్రత్త చేసి వాటి నుంచి తోక కప్పలు పుట్టగానే, వాటిని రక్షించి వాటి పెరుగుదలను దగ్గరగా గమనిస్తూ సంరక్షిస్తున్నానన్నాడు. పిల్లల పెంపకంతో సమానంగా దీని పట్ల ఆయనకు ఎంత శ్రద్ధో! ముందు నీటి కుంటల్లోకి గుడ్లు వదిలి పిల్ల కప్పలుగా బయటికి వచ్చాక అవి పెరిగి పెద్ద పెద్ద కప్పలుగా రూపాంతరం చెందడంలో వాటికి ఎంతో రక్షణ కల్పించాడట. ఇలా అవి ఐదు పది కాదు వందల సంఖ్యలో ఆయన ఇంటి పెరటి తోటనంతా తమ నివాసం చేసుకున్నాయి. ఇంత పెద్ద కప్పల దండును తయారు చేయ డంలో ఎంతో ఆనందిస్తున్నానని వీడియో లో తన సంతోషాన్ని పంచుకుంటూ తన్మయత్వం చెందాడు. తమాషా ఏమంటే, ఇపుడు ఆయన తన పెరటి తోటలో పచ్చిక మీద నడవడానికి బొత్తిగా అవకాశం లేదట. అటు వెళ్లి అంతకుముందులా సరదాగా తిరుగుదామంటే పాదాల కింద పడి కప్పలు ఛస్తాయేమోనని భయం పట్టుకుని అటు వెళ్లడం మానుకోవాలని నిర్ణయానికి వచ్చేడట! చూశారా ఆ పెద్ద మనిషి కప్పల ప్రేమ. మనం ఎంత ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్లో, పిల్లి పిల్లో అడ్డు తగిలితే కాలితో తన్ని అవతలకు నెట్టేస్తుంటాం. కానీ ఆయన అసలు వాటిని ఇబ్బంది పెట్టకూడదని అటు వేపు వెళ్లడం బాగా తగ్గించేశాడట! అన్నట్టు ఆయన కప్పల దండును చూడ్డానికి ఇపుడు వందల మంది క్యూ కడుతున్నారని చెబుతున్నాడు. ఆయన సామాజిక మాధ్యమంలో వదిలిన ఈ వీడియో ఇప్పటికి 2.8 లక్షలమంది చూశారు. ట్విటర్‌లో దాన్ని రామ్సే బోల్టిన్ అనే అతను షేర్ చేశాడు. చాలా మంది ఈ కప్పల దండు యజమానిని కలిసి ఆయన ఈ సైన్యం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఆయన కప్పల సైన్యాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేసినవారూ వున్నారు. ఈపెద్ద మనిషి అన్ని వేల కప్పలతో పెద్ద సైన్యాన్ని తయారు చేసిన ఆనందంలో వున్నాడు గానీ, నిజానికి ఈ వ్యక్తి కప్పల దండు వల్ల పర్యావరణ విపత్తు కలిగేందుకు ఆస్కారం వుందంటున్నారు పలువురు పర్యావరణ వేత్తలు. కాగా మరొకతను చిన్నపుడు తమ నివాసం సమీపంలోని చెరువులో అస్సలు కప్పలే లేకపోవడం పట్ల విచారించాను, చెరువు అంతా కప్పల బెక బెకతో నిండాలని అనుకునేవాడిని. కానీ ఇన్ని వేల కప్పలను చూశాక అమ్మో నేను ఇలాంటి పనులు చేయలేదు నయమే! అని ట్వీట్ చేశాడు. మొత్తానికి కప్పల సైన్యంతో ఆ మనిషి ఎలా వేగుతున్నాడో!
http://www.teluguone.com/news/content/one-mans-frog-army-attracted-netizens-gone-viral-on-social-media-25-137896.html





