నిఘా నిద్రపోతోందా?.. ప్రభుత్వం పడుకుందా? అసలేం జరుగుతోంది?
Publish Date:Jun 17, 2022
Advertisement
తెలంగాణ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే ఆదర్శం అంటూ సొంత భుజాలు తడుముకుంటున్న ప్రభుత్వం రాజధాని నగరం హైదరాబాద్ లో పెచ్చరిల్లుతున్న విధ్వంసకాండకు ఏం సమాధానం చెబుతుంది. పబ్బులు, డ్రగ్గులు, అత్యాచారాలతో ఇప్పటికే రక్షణ లేని నగరంగా ముద్ర వేసుకున్న హైదరాబాద్ వరుసగా రెండు రోజుల పాటు వేర్వేరు నిరసన కార్యక్రమాలలో హింస ప్రజ్వరిల్లడాన్ని ఎలా సమర్ధించుకుంటుంది. గురువారం కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అయితే ఏకంగా పోలీసు కాలరు పట్టుకుని నిలదీశారు. బస్సును నిలిపివేసి దానిపైకి ఎక్కి మరీ నినాదాలు చేశారు. పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోనికి తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ జరపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఓ ద్విచక్ర వాహనానికి రోడ్డుపైనే నిప్పుపెట్టి తగలబెట్టారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాక, బస్సుపైకి ఎక్కి నినాదాలు చేశారు. రాజ్ భవన్ మార్గంలో పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేసినా వాటిని తొలగించి కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వైపు ముందుకు కదిలారు. కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసినా పోలీసులు అప్రమత్తం కాలేదెందుకు? నిఘా నిద్రపోతున్నదా? పాలనపై ప్రభుత్వానికి పట్టు దప్పిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. రాజ్ భవన్ ముట్టడి అలా ఉద్రిక్తతలు సృష్టిస్తే శుక్రవారం సికిందరాబాద్ స్టేషన్ లో జరిగిన విధ్వంసంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా వేలాది మంది సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. స్టేషన్ బయట ఉన్న బస్సును దగ్ధం చేశారు. స్టేషన్ లో ప్లాట్ ఫాంపై ఉన్నరైళ్లకు నిప్పుపెట్టారు. పట్టాలపై ఒక బైక్ ను పడేసి దగ్ధం చేశారు. పార్సిళ్లను పట్టాలపై దగ్ధం చేశారు. ప్లాట్ ఫాంపై ఉన్న స్టాళ్లను ధ్వంసం చేశారు. పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు. ఇంత విధ్వంసం అప్పటికప్పుడు హఠాత్తుగా వేలాది మంది వచ్చి చేశారని అనుకోవడానికి లేదు. ముందుగా మాట్లాడుకుని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకునే వచ్చి ఉంటారు. సరే వచ్చిన తరువాత ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది అది వేరే సంగతి. ఈ ఘటనలోనూ ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏమైంది, ఏం చేస్తోందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగినా, వరుస సంఘటనలతో హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సీఎం కేసీఆర్ కానీ, మంత్రులు కానీ వీటిని సీరియస్ గా తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేసి చేతులు దులిపేసుకున్నారు. సికిందరాబాద్ ఘటన అయితే యువతలో పెచ్చరిల్లిన అసహనానికి, మోడీ సర్కార్ పై వ్యతిరేకతకు నిదర్శనం అంటూ బీజేపీ టార్గెట్ గా రాజకీయ విమర్శలకు పరిమితమయ్యారు. రాష్ట్రప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందనీ, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ బాధ్యతను విస్మరించి రాజకీయ విమర్శలతో పబ్బం గడుపుకుంటోదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/what-happend-to-hyderabad-25-137894.html





