ఏపీ, తెలంగాణకి ఆక్సిజన్ ఆపేయండి.. ఇదేమి శాడిజం?
Publish Date:Apr 25, 2021
Advertisement
దేశమంతా ఆక్సిజన్ డిమాండ్. దేశవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం. అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను.. అవసరం మేరకు అవసరం ఉన్నచోటకు తరలిస్తోంది కేంద్రం. ఇదే ఇప్పుడు రాష్ట్రాల మద్య చిచ్చుకు కారణమవుతోంది. ఢిల్లీకి రావలసిన ఆక్సిజన్‌ను యూపీ ఆపేస్తోందంటూ కేజ్రీవాల్ మొత్తుకుంటున్నారు. ఆ వివాదం సమసిపోకుండానే.. మరో రాష్ట్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై పడి ఏడుస్తోంది. మా రాష్ట్రంలో తయారయ్యే ఆక్సిజన్‌ను ఏపీ, తెలంగాణకు తరలించద్దొంటూ ఏకంగా కేంద్రానికి లేఖ రాసింది తమిళనాడు. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం పళనిస్వామి రాసిన లేఖ కలకలం రేపుతోంది. తమిళనాడు నుంచి తెలుగురాష్ట్రాలకు వెళ్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీఎం పళనిస్వామి.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోందని అందువల్ల తమ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న ప్రాణవాయువును తక్షణమే నిలిపివేయాలని కోరారు. రాష్ట్రంలో 400 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 310 మెట్రిక్ టన్నులు ఖర్చవుతోందని లేఖలో తెలిపారు. కానీ, కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో భవిష్యత్‌లో 450 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు అవసరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాలకు సరఫరా అవుతున్న 80 మెట్రిక్‌టన్నుల సరఫరాను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. గతఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం 58 వేల కేసులు అధికంగా నమోదవుతున్నాయని పళని వివరించారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి అవసరమైనంత ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించలేదని లేఖలో పేర్కొన్నారు ‘‘ రాష్ట్రంలో ప్రస్తుతం 310 మెట్రిక్‌టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఖర్చవుతోంది. కానీ కేంద్రం మాత్రం 220 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది. శ్రీపెరంబదూర్‌లో ఉత్పత్తి అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తెలుగు రాష్ట్రాలకు వెళ్లిపోతోంది.’’ అని లేఖలో రాశారు. తమిళనాడు కంటే తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లోనూ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయనీ, అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను ఆయా రాష్ట్రాలు వినియోగించుకుంటే శ్రీపెరంబదూర్‌లో ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌ను చెన్నై లోని వివిధ ఆస్పత్రులకు అందజేయవచ్చని అన్నారు. అలాగని తమిళనాడు ఎలాంటి ఆంక్షలు పెట్టదని, పొరుగు రాష్ట్రాలకు వీలైనంత వరకు తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. కానీ, ఇక్కడి అవసరాలకు సరిపడా ఆక్సిజన్ సరఫరా లేకపోతే చెన్నై సహా మరికొన్ని జిల్లాల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడుతుందని అన్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి.. ప్రధాని మోదీకి రాసిన లేఖ రాష్ట్రాల మధ్య వైషమ్యాలను పెంచేలా ఉందని జాతీయ వాదులు తప్పుబడుతున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న చోటకే కేంద్రం ప్రాణవాయువును సరఫరా చేస్తోందని చెబుతున్నారు. ఇలాంటి సున్నిత విషయాల్లో కాస్త సంయమనం పాటించాలని తమిళనాడు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు.
http://www.teluguone.com/news/content/objection-on-oxygen-supply-to-ap-telangana-by-tamilnadu-cm-palani-swamy-25-114265.html





