బెజవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం
Publish Date:Apr 27, 2023
Advertisement
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు శుక్రవారం (ఏప్రిల్ 28) విజయవాడ నగరంలో జరగనున్నాయి. నగర శివారులోని పెనమలూరు నియోజకవర్గ పరిధిలో తాడిగడపలో 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్ వేదికగా ఈ జయంతి వేడుకలు జరగనున్నాయి. అందుకు సంబంధించి భూమి పూజా కార్యక్రమం మంగళవారం (ఏప్రిల్ 25) ఎన్టీఆర్ శత జయంతి కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గత ఏడాది మే 28వ తేదీన ప్రారంభమైన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. ఈ ఏడాది మే 28వ తేదీతో ముగియనున్నాయి. అలాంటి వేళ.. బెజవాడలో జరగనున్న శత జయంతి వేడుక ఓ ప్రత్యేకతను సంతరించుకొంది. ప్రముఖ పాత్రికేయుడు వెంకట నారాయణ రచించిన ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు , అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం నేపథ్యంలో తరతరాలకు ఆయన గుర్తుండిపోయేలా 'జయహో ఎన్టీఆర్' అన్న వెబ్‌సైట్, 'శకపురుషుడు' అనే ప్రత్యేక సంచికను సైతం తీసుకువస్తున్నారు. కథానాయకుడు ప్లస్ మహానాయకుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్, టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. ఎన్టీఆర్ యాప్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. మరోవైపు ఈ ఏడాది ఎన్టీఆర్ శత వసంతాలు పూర్తి చేసుకొంటున్న తరుణంలో దేశ విదేశాల్లో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు జన్మదినం మే 28. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈ ఏడాది రాజమహేంద్రవరం వేదికగా మహానాడు నిర్వహిస్తున్నారు. గతేడాది ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/ntr-centinary-celebrations-in-bezawada-25-154319.html





