విజయమ్మ, షర్మిలకు పోలీసుల వార్నింగ్!
Publish Date:Apr 26, 2023
Advertisement
కనిపించే మూడు సింహాలు.. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమే రా పోలీసు.. పోలీసు... అంటూ పోలీస్ స్టోరీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ చెప్పే డైలాగులో.. పోలీసుల్లోని అంకితభావం, వారిలో ప్రజల కోసం శ్రమించే తత్వం, నీతి నిజాయితీ, అలాగే అవసరమైతే ప్రజల రక్షణ కోసం ఆత్మార్పణకు సైతం వెనకడుగు వేయని ధైర్య సాహసాలు..తదితర అర్థాలు ప్రతిధ్వనిస్తాయి. అయితే నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి బాగోగులతోపాటు... సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించే క్రమంలో సదరు పోలీసులపై విమర్శలు సైతం వెల్లువెత్తుతుండడమే కాకుండా.. వారిపై దాడులకు సైతం తెగబడుతుండడం ఓ విపరీత పరిణామం అని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ మహానగరంలో పోలీస్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము కిందే లెక్క. విధి నిర్వహణలో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతోన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. ఉంటున్నాయి. అయితే విధుల్లో ఉన్న పోలీసులపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, అలాగే ఆమె తల్లి వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ.. దాడి చేయడం.. అందుకు సంబంధించిన వీడియోలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి స్పందించారు. ఎంతో బాధ్యతాయుతంగా.. శాంతి భద్రతలల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి చర్యలతో పోలీసుల్లో ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షించకూడదని హెచ్చరించారు. విజయమ్మ, షర్మిల చర్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలన వారిద్దరికి ఈ సందర్భంగా నల్లా శంకర్ రెడ్డి సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత గుర్తింపు ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ఈ మధ్య కాలంలో కొంత మంది రాజకీయ నాయకులు.. వ్యక్తిగత గుర్తింపు కోసం అందునా గతంలో ఎంతో బాధ్యతాయుత పదవులు నిర్వర్తించిన వారు కూడా వ్యక్తిగత ప్రాచుర్యం కోసం ఇలాంటి చౌకబారు చర్యలతో పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. షర్మిల సోమవారం సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత.. టీ సేవ్ నిరాహారధీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి మద్దతు కోరాలని నిర్ణయించారు. అందులోభాగంగా ఇంటి నుంచి షర్మిల బయలుదేరుతుండగా.. పోలీసులు బారీ ఎత్తున మోహరించి.. ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వారిపై వైయస్ షర్మిల చెయ్యి చేసుకున్నారు. అనంతరం ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసు స్టేషన్‌లో ఉన్న తన కుమార్తెను కలిసేందుకు ఆమె తల్లి విజయమ్మ వచ్చారు. పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లకుండా ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో వైయస్ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహిళా పోలీసులపై చెయ్యి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల పట్ల షర్మిల, వైయస్ విజయమ్మ వ్యవహరించిన తీరుపై పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/police-warning-to-sharmila-vijayamma-25-154317.html





