ఇప్పుడిక సమాజ్ వాదీ పార్టీ వంతు!
Publish Date:Jun 17, 2026
Advertisement
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీని సాధించడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధమైన ఆమోదం లభించాలంటే ఈ మెజార్టీ అత్యంత కీలకం. ఈ బిల్లును ఎలాగైనా గట్టెక్కించేందుకు వీలుగా విపక్ష ఇండియా కూటమిని బలహీనపరిచే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తున్నది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది ఎంపీలు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు తిరుగు బావుటా ఎగురవేసి స్పీకర్‌కు లేఖలు సమర్పించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది. మహారాష్ట్ర, బెంగాల్ తరహాలోనే త్వరలోనే సమాజ్‌వాదీ పార్టీలోనూ అతిపెద్ద చీలిక రాబోతోందనీ, ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, సీనియర్ నేతలు ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారంటూ ఓం ప్రకాష్ రాజ్‌భర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. పాత కేసుల ఉచ్చు బిగుస్తుండటంతో కొందరు ఎస్పీ ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ బాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ కోసం ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి డ్రామాలకు తెరలేపిందని పేర్కొంది. అయితే.. చీలికల నుంచి తన పార్టీని కాపాడుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వై కేంద్రంతో నేరుగా ఘర్షణ పడే వైఖరిని పక్కనపెట్టి, తమ పార్టీ జోలికి రాకుండా ఉండేలా ఆయన ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాపై అఖిలేష్ యాదవ్ సభలో చాలా సానుకూలంగా స్పందించడాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాను అధికారికంగా డీలిమిటేషన్ బిల్లులో చేరిస్తే తాము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని అఖిలేష్ సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సక్సెస్ అయితే ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సీట్ల పెంపు ఫార్ములాకు అఖిలేష్ కూడా ఆమోదం తెలపడంతో బీజేపీ హైకమాండ్‌కు ఆయన వైపు నుండి లైన్ క్లియర్ అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ సీట్ల పెంపు ఫార్ములా ఒప్పందం గనుక కుదిరితే, సమాజ్‌వాదీ పార్టీని చీల్చాల్సిన అవసరం బీజేపీకి ఉండకపోవచ్చంటున్నారు. దీనివల్ల అఖిలేష్ యాదవ్ తన పార్టీని కాపాడుకుంటూనే, వ్యూహాత్మకంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/now-it-is-the-samajwadi-partys-turn-45-223329.html




