టోల్ గేట్లకు చెల్లు చీటీ!
Publish Date:Dec 18, 2025
Advertisement
ఇక టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఉండవు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ గేట్లనూ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే టోల్ వసూళ్లు మాత్రం ఆగవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విధానం వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నూతన టోల్ విధానం పూర్తిగా ఉపగ్రహ, ఏఐ సాంకేతికతలపై ఆధారపడి ఉంటుందన్నారు. దీని వల్ల వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. దీని వల్ల వాహనదారులకు ఇంధనం ఆదా అవడమే కాకుండా, ప్రభుత్వానికి అదనంగా ఆరువేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ విధానంలో టోల్ గేట్లకు బదులుగా గాంట్రీ గేట్స్ నిర్మిస్తారు. వీటిపై హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చడం ద్వారా, వాహనాలు గరిష్ట వేగంతో వెళ్లినప్పటికీ.. ఆ వాహనం నంబర్ ప్లేట్ ను గుర్తించి, విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో టోల్ ఛార్జీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా వసూలు అవుతాయని గడ్కరీ తెలిపారు.
ఇక నుంచి ఏఐ, శాటిలైట్ ఆధారిత సిస్టమ్ ద్వారా టోల్ వసూళ్లు జరిగేలా చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/no-toll-gates-in-fututr-36-211242.html





