పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాక్!
Publish Date:Dec 19, 2025
Advertisement
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మరోసారి షాకిచ్చింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గర్భనిరోధక సాధనాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలన్న పాక్ ప్రభుత్వ అభ్యర్థనను ఐఎంఎఫ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. పన్ను వసూళ్లలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, కండోమ్‌లపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని తొలగించేందుకు ద్రవ్య నిధి ససేమిరా అంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి పొందుతున్న బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భనిరోధక సాధనాలపై పన్ను తగ్గిస్తే రాబడి లక్ష్యాలు దెబ్బతింటాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఒకవేళ రాయితీలు ఇవ్వాలనుకుంటే వచ్చే బడ్జెట్ వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే పన్నుల అమలు యంత్రాంగం బలహీన పడుతుందనీ, పైగా ఈ వస్తువుల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. కేవలం కండోమ్‌లే కాకుండా మహిళలకు అవసరమైన శానిటరీ ప్యాడ్‌లు, శిశువుల డైపర్లపై కూడా పన్ను రాయితీలు ఇవ్వడానికి ఐఎంఎఫ్ నో అంది. పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పంపిన ఈ ప్రతిపాదనల వల్ల దాదాపు 400 నుంచి 600 మిలియన్ పాకిస్థాన్ రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసి, ఆ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ప్రస్తుతం అక్కడ ఏటా దాదాపు 60 లక్షల మంది జనాభా అదనంగా చేరుతున్నారు. జనాభా వృద్ధి రేటు 2.55 శాతంగా ఉంది. ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వ సేవలు, సామాన్యుల ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇలాంటి సమయంలో గర్భనిరోధక సాధనాలను చౌకగా అందించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఐఎంఎఫ్ నిబంధనల వల్ల విధించిన 18 శాతం జీఎస్‌టీ కారణంగా, ఇవి సామాన్యులకు అందనంత భారంగా మారాయి. విదేశీ అప్పుల కోసం నిత్యావసరాలను కూడా పాక్ ప్రభుత్వం లగ్జరీ వస్తువులుగా పరిగణించాల్సి రావ డం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రుణం కోసం ఐఎంఎఫ్ షరతులను నెరవేర్చడానికి పాకిస్థాన్ నానా పాట్లూ పడుతోంది. పన్ను వసూళ్లతో పాటు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఐఎంఎఫ్ నుంచి దాదాపు 3.3 బిలియన్ డాలర్ల నిధులను పాక్ పొందింది. ఈ అప్పుల నుంచి బయటపడలేక.. చివరకు దేశ జనాభా నియంత్రణ అంశాన్ని కూడా ఆర్థిక లెక్కలకే వదిలేయాల్సిన దుస్థితిలో పాకిస్థాన్ ఉంది.
http://www.teluguone.com/news/content/imf-shock-to-pakisthan-36-211249.html





