నో రోడ్.. నో ఓట్ ... పార్టీలకు ఓటర్ల అల్టిమేటం!
Publish Date:Aug 26, 2022
Advertisement
పార్టీలు, అజెండాలు,సిద్ధాంతాలు, వాస్తవ కార్యాచరణలకు ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నది ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ. అధికార పార్టీలు ముఖ్యంగా, తాము అధి కారంలో మరింత కాలం ఉండిపోవడానికి, విపక్షాలు వారిని చొక్కాలాగి కిందపడేయడానికే అన్నట్టు తయారయ్యాయి. ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి చేసిన, చేస్తున్న ప్రమాణాలు, ఇచ్చిన ఇస్తున్న హామీలు, ప్రసంగాలకు బొత్తిగా పొంతనే ఉండటం లేదు. కేవలం మంచి రోడ్డు, మంచి ఆస్పత్రి, బడి మించి ఏ ఓటరూ ఎక్కవగా ఏదీ డిమాండ్ చేయడు. కానీ ఆ చిన్న సమస్యను, డిమాండ్‌ను తీర్చడంలోనూ అధికార, విపక్షాలు ఏమాత్రం కృషి చేయడం లేదు. కేవలం ప్రజల్ని ఓటర్లుగా చూడ డంతోనే అసలు సమస్య తలెత్తు తోందన్నది విశ్లేషకుల మాట. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో చాలా గ్రామాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వాటిని వెంటనే ఉపయోగపడేలా చేయడానికి ప్రభుత్వం ఏమాత్రం గట్టి చర్య తీసుకోలేదు. గతంలో అనేకపర్యాయాలు ప్రభుత్వం గ్రామాల విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం తమ పాలన ఎలా ఉంది? మీకు అన్నీ అందుతున్నాయా? పథకాలు ఎలా ఉన్నాయి వంటి ప్రశ్నలు అడిగి ప్రజల నుంచి సానుకూల స్పందననే కోరుకోవడం తప్ప వాస్తవానికి ఏమీ చేయడం లేదన్నది సుస్పష్టం. ప్రతీ చిన్న పని కూడా అధికారుల చుట్టూ తిరగడం సామాన్యులకు అలవాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని కార్యాలయాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసంక్షేమం అంటూనే ప్రజలపక్షంగా ఆలోచించి చేయడమన్నది జరగడమే లేదు. అందుకే ప్రజలు ఆగ్రహించారు. అందుకే ఓట్లు అడగడానికి వచ్చేవారిని ప్రజలే నిలదీస్తున్నారు. అందుకు ఉదాహరణే మునుగోడు ఓటర్ల అల్టిమేటం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నేతలకు ఓటర్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫి కేషన్కు ముందే తమ డిమాండ్‌లను లేవనెత్తుతున్నారు. ఆ క్రమంలోనే చండూరు మండలం పడమటితాళ్ల గ్రామస్తులు నిరసన చేపట్టారు. మాకు రోడ్లు వేస్తే.. మీకు ఓట్లు వేస్తాం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలతో ర్యాలీ తీశారు. రోడ్డు సౌకర్యం సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్‌లతో మూకుమ్మడి తీర్మానం చేశారు. అంతేకాదు తమ డిమాండ్‌లను పరిష్కరించకపోతే ఓట్లు వేయబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. నో రోడ్ నో ఓటు అని ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు మును గోడులో హాట్ టాపిక్‌గా మారాయి.
http://www.teluguone.com/news/content/no-road-25-142695.html





