కాంగ్రెస్‌కు గులాంనబీ ఆజాద్ గుడ్ బై
Publish Date:Aug 26, 2022
Advertisement
చాలాకాలం నుంచి అసం తృప్తితో సతమతమవుతున్న గులాంనబీ ఆజాద్ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వం, పదవులను ఆయన వదులుకున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు అందుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఆజాద్ తన నిర్ణయాన్ని లేఖ ద్వారా ప్రకటించి పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. వాస్తవానికి ఆయన చాలాకాలం నుంచి పార్టీ తీరుతెన్నుల పట్ల, అభిప్రాయాల పట్ల విమర్శిస్తూనే ఉన్నారు. మొత్తానికి పార్టీతో ఉన్న 50 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ.. హస్తం పార్టీని వీడారు. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కి నాలుగు పేజీల లేఖ రాశారు. ఈ సంద ర్భంగా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆజాద్. కాంగ్రెస్ పార్టీని అనుభవం లేని సైకోఫాంటిక్ నాయకుల కొత్త సర్కిల్‌గా ఆయన అభివర్ణించారు. భారత్ జోడి యాత్రను ప్రారంభించే ముందు కాంగ్రెస్ జోడి యాత్ర చేసి ఉండాలని విమర్శించారు. తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ పైనా విమర్శలు గుప్పించారు. ఆయనలో రాజకీయ పరిపక్వత లేదని.. ఇంకా చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం కూడా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది అసమ్మతి వర్గం నేతల్లో గులాం నబీ ఆజాద్ సైతం ఉన్నారు. జీ-23గా పేరున్న సీనియర్ నేతల బృందం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారు లేఖ రాయడంపై అప్పట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారా లను రచ్చకీడుస్తున్నారని మండిపడ్డారు.అప్పటి నుంచీ గులాం నబీ ఆజాద్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఘాటుగా స్పందించింది. రాజీనామా చేసేందుకు ఇదా సమయం అని ఆ పార్టీ ప్రతినిధి ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రతినిధి జైరాం రమేష్ నిలదీశారు. ఆయన శుక్రవారం (ఆగష్టు 26) మీడియాతో మాట్లాడుతూ, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా పలు అంశాలపై బీజేపీతో కాంగ్రెస్ పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆజాద్ రాజీనామా చేయడం విచారకరమని అన్నారు. రాహుల్ గాంధీ పార్టీకి తీరని నష్టం చేశారని, రాహుల్‌కు పరిపక్వత లేదని, రిమోట్ కంట్రోల్‌తో పార్టీ నడుస్తోందని గులాంనబీ ఆజాద్ తన సుదీర్ఘ రాజీనామా లేఖలో ఆరోపించారు. కేవలం కీలుబొమ్మ ల్లాంటి ప్రాక్సీ ల పేర్లు పార్టీ అధ్యక్షుడి పదవికి వినిపిస్తున్నాయని ఆరోపించారు. పార్టీలో సంస్కరణలు కోరుతూ 23 మంది నేతలు సంతకాలతో లేఖ రాసిన తర్వాత సీడబ్ల్యూసీ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తమను చిన్నబుచ్చారని ఆరోపించారు. కాగా, గులాం నబీ ఆజాద్ తన లేఖలో పేర్కొన్న అంశాలు అవాస్తమని, ద్రవ్యోల్బణం, పోలరైజైషన్‌కు వ్యతిరేకంగా పార్టీ పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం సందర్భోచితం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆజాద్ కు అన్నీ ఇచ్చిందని, ఆయన ఈరోజు పేరున్న నాయ కుడు అయ్యాడంటే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సోనియాగాంధీ కారణమని అన్నారు. పార్టీలో ఆయన ఎన్నోపదవులు కూడా చేపట్టారని, అలాంటి ఆజాద్ రాజీనామా లేఖ రాసారంటే ఏమీ మాట్లాడ లేకుండా ఉన్నామని అన్నారు. రాజీనామా లేఖ రాస్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. గతంలో ఆయన సోనియా గాంధీ వైద్యపరీక్షల కోసం అమెరికా వెళ్లినప్పుడు కూడా లేఖ రాశారని అన్నారు.
http://www.teluguone.com/news/content/gulamnabi-azad-quits-congress-25-142698.html





