బీజేపీ రాజాసింగ్ ను సస్పెండ్ చేయడానికి కారణమదేనా?
Publish Date:Aug 26, 2022
Advertisement
బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకులలో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లను ఇటీవలి వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఆర్ఇర్ గా అభివర్ణించేవారు. అలాంటిది రాజాసింగ్ ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పార్టీ శ్రేణులలో దిగ్భ్రమకు కారణమైంది. అయితే ఆయన సస్పెన్షన్ పై ఎవరూ నోరు మెదపలేదు. ఇటీవలి కాలంలో రాజా సింగ్ బీజేపీకి దూరంగా ఉంటున్నారనీ, అంతే కాకుండా తెరాసకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారనీ ఆయనపై పార్టీలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాను ధర్మాన్నే నమ్ముతాననీ, తనకు ధర్మం కంటే పార్టీ ఏమంత ముఖ్యం కాదనీ రాజా సింగ్ వ్యాఖ్యానించడాన్ని కూడా పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. రాజా సింగ్ మాటలలో పార్టీ ధర్మాన్ని పాటించడం లేదన్న విమర్శ ఉందని కూడా వారంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభ మసకబారిందనీ, బీజేపీ అధికారం చేపట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయనీ బీజేపీ భావిస్తోంది. ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్యే పార్టీ విధానాలను తోసి రాజన్నట్లు మాట్లాడటం, బీజేపీకి నష్టం చేకూర్చేలా సున్నితమైన విషయాలలో అనవసర దూకుడు ప్రదర్శించడం పట్ల పార్టీ నాయకత్వంలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే స్టాండప్ కమేడియన్ మునావర్ షో ను నిరసిస్తూ రాజా సింగ్ చేసిన హడావుడి, ఆ తరువాత ఆయన విడుదల చేసిన వివాదాస్పద క్యాసెట్ అన్నీ కూడా రాజకీయంగా టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేవిగానే ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గత కొంత కాలంగా రాజాసింగ్ వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తున్న పార్టీ అధిష్ఠానం ఆయనను ఇంకెత మాత్రం ఉపేక్షించడం తగదన్న నిర్ణయానికి వచ్చే సస్పెన్షన్ వేటు వేసిందని పరిశీలకులు అంటున్నారు. మునావర్ స్టాండప్ కామెడీ షోకు వ్యతిరేకంగా బీజేపీ ఎటువంటి ఆందోళనా కార్యక్రమాలకూ పిలుపు నివ్వకపోయినా రాజా సింగ్ తన వ్యక్తిగత హోదాలోనే మునావర్ షోను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడం, అరెస్టు కావడం వంటివన్నీ తెరాసకు మేలు చేసేవిగానే ఉన్నాయని వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ వివాదాస్పద వీడియో విడుదల చేయగానే క్షణం ఆలస్యం చేయకుండా రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకండా.. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసిందని చెబుతున్నారు. ఆ తరువాత రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసినా బీజేపీ నుంచి ఎవరూ ఖండించకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా రాజకీయ వర్గాలు చూపుతున్నాయి. అసలు మునావర్ స్టాండప్ కామెడీ షోకు వ్యతిరేకంగా రాజాసింగ్ హడావుడి చేయడం.. ఆ తరువాత తాను స్వయంగా ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా వివాదాస్పద వీడియో విడుదల చేయడం.. వీటన్నిటి వెనుకా టీఆర్ఎస్ అగ్రనేత ఒకరు ఉన్నారని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత హోదాలో మునావర్ షోకు వ్యతిరేకంగా హంగామా చేయడం, ఆ తరువాత వివాదాస్పద వీడియో విడుదల చేయడంతో రాజాసింగ్ టీఆర్ఎస్ తో చేతులు కలిపి ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న నిర్ధారణకు వచ్చిన బీజేపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/is-this-the-reason-for-bjp-to-suspend-rajasingh-25-142692.html





