పరిపాలనలో వేళ్ళు పెడుతున్న ‘చిన్న’బాబు లోకేష్!
Publish Date:Jul 29, 2014
Advertisement
తెలుగుదేశం పార్టీ మీద తన తండ్రి చంద్రబాబు నాయుడి తర్వాత ఆ స్థాయిలో పట్టు సాధించిన నారా లోకేష్ ఇప్పుడు తన పట్టును ప్రభుత్వం మీద కూడా బిగించడానికి నడుం బిగించినట్టు కనిపిస్తోంది. దీనిలో భాగంగా పరిపాలనకు సంబంధించిన అంశాలలో కూడా ‘చిన్న’బాబు నారా లోకేష్ వేళ్ళు పెడుతున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాల మీద నారా లోకేష్ పరోక్షంగా ప్రభావాన్ని చూపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష కార్యాచరణకు దిగిపోయారు. పరిపాలనకు సంబంధించిన అంశాలలో మెల్లమెల్లగా జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. తాజాగా మంత్రులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సెక్రటరీల నియామకానికి సంబంధించిన అంశంలో లోకేష్ జోక్యం చేసుకున్నారు. ఏడుగురు మంత్రులు నియమించుకున్న ప్రైవేటు సెక్రటరీలను లోకేష్ తొలగించి ఆ స్థానాల్లో తనకు నచ్చిన వారిని నియమించారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నియమించుకున్న ప్రైవేట్ సెక్రటరీని లోకేష్ తొలగించి, ఆ స్థానంలో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగిగా వున్న ఒక మహిళను లోకేష్ నియమించారు. సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు తనకు నచ్చిన వ్యక్తే తన ప్రైవేటు సెక్రటరీగా వుండాలని ఎంత ప్రయత్నించినా చిన్నబాబు దగ్గర ఆయన పప్పులు ఉడకలేదని తెలుస్తోంది. ‘పైనుంచి’ ఒత్తిడి రావడంతో లోకేష్ చేసిన నియామకానికి యనమల తల ఊపక తప్పలేదని సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు నియమించుకున్న ప్రైవేటు సెక్రటరీని కూడా లోకేష్ సాగనంపేశారు. అలాగే గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర ప్రైవేటు సెక్రటరీలుగా పనిచేసిన వారిలో కొంతమందిని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులు కూడా కొనసాగించాలని భావించారు. ఆయా శాఖల్లో వారికి ఉన్న అనుభవం పరిపాలనలో తమకు ఉపయోగపడుతుందని వారు ఆశించారు. అయితే లోకేష్ మాత్రం గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రైవేట్ సెక్రటరీలు ఎవరినీ నియమించుకోవద్దని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మంత్రుల ప్రైవేట్ సెక్రటరీలుగా లోకేష్ పచ్చజెండా ఊపినవారినే నియమిస్తున్నట్టు సమాచారం. పార్టీ మీద పూర్తి పట్టు సాధించిన లోకేష్ పరిపాలన, ప్రభుత్వం మీద కూడా పట్టు సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి నుంచే పార్టీ, ప్రభుత్వం మీద గ్రిప్ సాధిస్తే 2019 ఎన్నికల నాటికి తాను చాలా ‘ముఖ్యుడిగా’ మారితే పరిపాలనలో అనుభవ లేమి వుండదని లోకేష్ భావిస్తూ వుండొచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే లోకేష్ పరిపాలనకు సంబంధించిన అంశాలలో జోక్యం చేసుకోవడం, ముఖ్యంగా పరిపాలలో మొదటి మెట్టు అయిన ప్రైవేట్ సెక్రటరీల నియామకం విషయంలోనే తమ మాట నెగ్గకపోవడం కొందరు మంత్రులను ఇబ్బందిపెడుతోందని తెలుస్తోంది. ఇప్పుడే పరిస్థితి ఎలా వుంటే ముందు ముందు లోకేష్ విశ్వరూపాన్ని ఏ స్థాయిలో చూడాల్సి వస్తుందో అని కొందరు మంత్రులు భయపడుతున్నట్టు సమాచారం. అయితే పార్టీ అధినేత కుమారుడు కావడంతో లోకేష్ ‘ఇన్వాల్వ్‌మెంట్’ విషయంలో మంత్రులు పెదవి విప్పలేకపోతున్నారని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/nara-lokesh-interference-in-government-administration-45-36617.html





