టీఆర్ఎస్ కు మునుగోడు భయం
Publish Date:Oct 16, 2022
Advertisement
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి భయం వెంటాడుతోందా? అందుకే ముందుగానే ఓటమికి కారణాలు వెతుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సింబల్స్ విషయంలో టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలో నెలకొన్న భయాన్నే సూచిస్తోందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎర్పడిన తరువాత ఇప్పటి వరకూ జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ టీఆర్ఎస్ కారు గుర్తుతోనే విజయం సాధించింది. ఆ తరువాత కూడా పలు ఉప ఎన్నికలలో కారు గుర్తుతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే తెరాస దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత మాత్రమే కారును పోలిన గుర్తులు ఉండటం వల్లనే ఓటమి పాలయ్యామని చెప్పుకుంది. ఇప్పుడు ముందుగానే ఆ విషయాన్ని గట్టిగా చెప్పడం ద్వారా ఇప్పటి నుంచే మునుగోడు ఉప ఎన్నిక ఓటమికి ఎక్స్యూజ్ వెతుక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభించేసింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎవరికీ కేటాయించవద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ నుంచి ఎలాంటి స్పందనలేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు టీఆర్ఎస్ నేతలు. హౌజ్ మోషన్ విచారణ చేపట్టాలని శనివారం కోరగా కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఎవరికీ కేటాయించరాదని కోరుతూ ఎన్నికల కమిషన్ ను ఈనెల 10న టీఆర్ఎస్ కోరిన సంగతి విదితమే. ‘కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందుకే ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించవద్దు’ అంటూ టీఆర్‌ఎస్ నేతలు సీఈవోని కోరారు. అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు టీఆర్ఎస్ నేతలు. గతంలో పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా..కారును పోలినట్లు ఉండే ఈ గుర్తులతో బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు అధిక ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వారికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకీ టీఆర్ఎస్ అంటున్నది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్‌రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. అందువల్ల ఆ గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ కోరుతోంది. ఈ విషయంమీదే హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమౌతోంది.
http://www.teluguone.com/news/content/munugodu-fear-to-trs-39-145526.html





