మహాభారతం టూ మోడ్రన్ భారత్ … ఎందరో బిజ్జలదేవుళ్లు!
Publish Date:Apr 19, 2017
Advertisement
బాహుబలి సినిమా మన పురాణల్లోని కథ కాదు! కాని, అందులోని పాత్రలు మన పురాణాల్లోంచి ప్రేరణ పొంది సృష్టించినవే! మరీ ముఖ్యంగా, భల్లాలదేవుడి తండ్రి, శివగామి భర్త… బిజ్జలదేవుడు మహాభారతంలోని ధృతరాష్ట్రుడు! అక్కడ ముసలాయనకి కళ్లు వుండవు. ఇక్కడ బిజ్జలదేవుడికి చేయి సరిగ్గా లేక అవిటితనం వుంటుంది. కాని, బిజ్జలదేవుడు అచ్చూ ధృతరాష్ట్రుడి మాదిరిగానే కొడుకు మీద వ్యామోహంతో న్యాయం పట్ల గుడ్డివాడైపోతాడు. బాహుబలికి దక్కాల్సిన సింహాసనం… తన కొడుకు భల్లాలదేవుడు అర్హుడు కాకపోయినా, దుర్మార్గుడైనా… వాడికే దక్కాలనుకుంటాడు! ధృతరాష్ట్రుడు కూడా దౌర్జన్యానికి దిగిన తన దుర్మార్గపు కొడుకు, దుర్యోధనుడ్ని గుడ్డిగా సమర్థిస్తాడు! భారతంలోని ధృతరాష్ట్రుడు, బాహుబలిలోని బిజ్జలదేవుడు ఇద్దరూ విలన్లే! కాదంటే విలన్లను సమర్థించిన వయసు ముదిరిన విలన్లు! ఇప్పటి ఆధునిక కాలంలోనూ ధృతరాష్ట్రులున్నారు రాజకీయాల్లో! అయితే, వారందర్నీ చెడ్డవారని జమకట్టాల్సిన పనిలేదు. కానీ, పాపం… ధృతరాష్ట్రుడు, బిజ్జలదేవుడి మాదిరిగానే చాలా మంది నేతలు తమ పుత్ర రత్నాల విషయంలో బలహీనతకి లోనయ్యారు. తాము కష్టపడి నారు వేసి, నీరు పోసిన పార్టీని ఎలాగోలా వారసుల చేతుల్లో పెట్టాలని రూల్స్ ని , టాలెంట్ ని పట్టించుకోకుండా పట్టాభిషేకాలు చేసేశారు! తరువాత అవ్వి ప్రజాస్వామ్యం దెబ్బకు, బ్యాలెట్ బ్యాటిల్లో బెడిసికొట్టాయి! చక్కగా ఎదిగిన పార్టీలు కాస్తా సన్ స్ట్రోక్ కు ఎండిపోయాయి! ఈ మధ్య కాలంలో తనయుడి దెబ్బకు బాల్చీ తన్నిన పార్టీ ఎస్పీ! ములాయం దశాబ్దాలు కష్టపడి పెంచిన సమాజ్ వాది అఖిలేష్ ఐదేళ్ల పాలనలో ఘోరంగా పంక్చరైంది! ఇప్పుడప్పుడే టైర్లు, ట్యూబ్ లు మార్చుకునే స్థితిలో కూడా లేదు! పైగా ఈ యూపీ రాష్ట్ర భల్లాలదేవుడు… బిజ్జలదేవుడి లాంటి ములాయంపైనే తిరుగుబాటు చేసి రచ్చ రచ్చ చేశాడు! ములాయం, అఖిలేష్ లాంటి రాజకీయ తండ్రి, కొడుకుల జంటలు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో వున్నాయి! కాని, ప్రతీ చోటా ప్రూవ్ అవుతోన్న ఒకే ఒక్క సత్యం.. భారతమైనా, బాహుబలి అయినా, ఆధునిక భారతదేశమైనా… అధికారానికి ప్రధానంగా కావాల్సింది అర్హత! వారసత్వం కాదు!
http://www.teluguone.com/news/content/mulayam-singh-45-74077.html





