భారతీయులారా మా దేశం రాకండి
Publish Date:Apr 19, 2017
Advertisement
ప్రపంచంలో బాగా శ్రమించే వారు..అత్యంత నమ్మదగిన వ్యక్తులు అంటే టక్కున చెప్పే పేరు భారతీయలనే..దేశం ఏదైనా, ప్రాంతమేదైనా భారతీయులు ఉన్న చోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. చాలా దేశాలు తమ కంపెనీల్లో ఇండియన్స్‌ని ఏరి కోరి పెట్టుకుంటాయి..కానీ ఇదంతా గతం..ఇప్పుడు భారతీయులంటే ఎవరికీ గిట్టడం లేదు కారణం ఆయా దేశాల్లోని స్థానికులకు మన వాళ్లు ఉద్యోగాలు దొరకకుండా చేస్తున్నారట ..అన్ని చోట్లా భారతీయులే ఉన్నత స్థానాల్లో ఉంటున్నారనే ద్వేషం మన మీద పెరిగిపోతోంది. అందుకే ఇండియన్స్‌ని తమ దేశాలు రాకుండా వీసా నిబంధనల్లో కఠిన మార్పులు చేస్తున్నాయి ఆయా దేశాలు. అమెరికాలో ట్రంప్ ప్రచారంతో మొదలైన ఈ ధోరణి రోజు రోజుకి పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్‌లు ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండగా, ఆస్ట్రేలియా కూడా ఇదే బాటలో నడుస్తూ తాత్కాలిక ఉద్యోగ వీసా విధానంపై కొరడా ఝళిపించింది. నైపుణ్యాలతో ముడిపడిన ఉద్యోగాల్లో చేరేందుకు భారతీయులు ఉపయోగించుకునే 457 వీసా విధానాన్ని రద్దు చేసి..దాని స్థానంలో కొత్త నిబంధనలతో తాత్కాలిక వీసా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. స్థానికంగా వనరులు ఉన్నప్పటికీ..తక్కువ వేతనం ఇచ్చి పనిచేయించుకోవచ్చనే ఉద్దేశ్యంతో విదేశీయులను దీని కింద ఆస్ట్రేలియాకు తెస్తున్నారని ఆ దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ అన్నారు. 457 వీసా కింద ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేస్తున్నవారిలో అత్యధికులు భారతీయులే. ఈ నిర్ణయం కారణంగా కొత్తగా ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయులు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇక మనదేశంపై అక్కసు వెళ్లగక్కుతున్న మరో దేశం బ్రిటన్ సంగతి చూస్తే..ఆ దేశం 2016 జనవరి నుంచి భారతీయ ఐటీ కంపెనీలకు వీసాల జారీని నామమాత్రం చేసింది. బ్రిటన్‌కు వచ్చే ఉద్యోగికి కనిష్ట వేతన పరిమితిని 30 వేల పౌండ్లకు పెంచింది. ఉద్యోగుల భార్య లేదా భర్త, తల్లిదండ్రులు రెండున్నరేళ్లకు మించి బ్రిటన్‌లో ఉండాలంటే..ఆంగ్ల భాషపై పట్టును పరీక్షించే కొత్త టెస్టును ఉత్తీర్ణులు కావాల్సిందేననే నిబంధన తెచ్చింది. ప్రస్తుతానికి ఈ మూడు దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేయగా వీటి బాటలో నడిచేందుకు సింగపూర్, మలేషియా, దుబాయ్ ఇతర గల్ఫ్ దేశాలు రెడీ ఉన్నాయి. ఫలితంగా భారతీయుల విదేశీ కలలు చెదిరిపోతున్నాయి.
http://www.teluguone.com/news/content/indians-visa-problems-45-74081.html





