మంత్రి గుడివాడతో ముద్రగడ భేటీ..వైసీపీలోకి కన్ఫర్మ్?
Publish Date:Jul 28, 2023
Advertisement
ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు సెగలు రేపుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. సామజిక వర్గాల లెక్కలేసుకొని మరీ రాజకీయంగా అడుగులేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పుడు కాపు సామజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు తెలుగుదేశం, వైసీపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పొత్తుగా వెళ్తాయనే ప్రచారం గట్టిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ వ్యవహారం ఇంకా తేలలేదు కానీ.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ వర్గాలు పొత్తు ఖరారైనట్లేనని భావిస్తున్నాయి. ఇరు పార్టీల శ్రేణులూ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేస్తున్నాయి కూడా. దీంతో వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ-జనసేన వైపు వెళ్లకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగమే ముద్రగడ పద్మనాభంను మళ్ళీ ఫోకస్ లోకి తేవడం. కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి నాతో పోటీ చెయ్ అని పవన్ కు ముద్రగడ సవాల్ కూడా విసిరారు. ఇక రెండు సార్లు బహిరంగ లేఖలు రాసారు. ముద్రగడ వ్యాఖ్యలు, లేఖలపై విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ముద్రగడ మీద తీవ్ర విమర్శలు గుపపించారు. అంతేకాదు కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారని ముద్రగడ పేర్కొంటే.. జనసేన కార్యకర్తలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ మనీ ఆర్డర్లు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో ముద్రగడ అటాక్ అప్పుడే మొదలైంది. ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేయడం మొదలు పెట్టారో.. వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశమవ్వడం మొదలు పెట్టారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ నేతల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలవగా.. ఇప్పుడు హఠాత్తుగా విశాఖకు వచ్చిన ముద్రగడ.. గాజువాకలో మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ అయ్యారు. అమరనాధ్ తో ముద్రగడ భేటీ వివరాలేవీ వైసీపీ నేతలు బయటకి రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ భేటీ వెనక ముద్రగడ రాజకీయ పునఃప్రవేశం, వచ్చే ఎన్నికలలో వైసీపీ నుండి పోటీకి దిగడం వంటి రాజకీయాలు అంశాలే ఉన్నాయని రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్నది. ముద్రగడ తెలుగుదేశం హయాం నుంచే వైసీపీకి టచ్ లో ఉన్నట్లు గోదావరి జిల్లా రాజకీయాలలో ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్ కాగా.. ఇక ఇప్పుడు ఆయన ఓపెన్ అయిపోయారనీ, ఇక వైసీపీలోకి జంప్ చేయడానికి రెడీ అయిపోయారనీ తెలుస్తున్నది. ఇప్పటికే ముద్రగడను కలిసిన వైసీపీ నేతలు ఈ మేరకు రాయబారం కూడా నడిపినట్లు చెబుతున్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాధ్ తో భేటీ వెనక కూడా కారణం ఇదే అయి ఉండవచ్చని చర్చ జరుగుతున్నది. నిజానికి ముద్రగడ,గుడివాడ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో కాపు ఉద్యమానికి మద్దతుగా గుడివాడ అమరనాధ్ తండ్రి, మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాధరావు నిలిచారు. ఆయనకూ ముద్రగడకు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో స్నేహితుని కుమారుడు మంత్రి అయిన గుడివాడను ఇప్పుడు ముద్రగడ కలిశారు. ఇక ముద్రగడ వైసీపీలోకి వస్తే పిఠాపురం సీటు ఇస్తారని తెలుస్తున్నది. ఎలాగో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు ప్రజలలో పెద్దగా పాజిటివ్ ఇమేజ్ లేదనీ, దీంతో ఆయన్ని సైడ్ చేసి ముద్రగడని నిలబెడతారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పిఠాపురం కాకపోతే కాకినాడ నియోజకవర్గం నుంచి ముద్రగడను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఒకవేళ ముద్రగడ పోటీ కి విముఖత చూపితే.. కుమారుడిని రంగంలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తానికి ముద్రగడ వైసీపీలోకి రావడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/mudragada-meets-minister-gudivada-amarnath-25-159134.html





