బీజేపీకి మద్దతు విషయంలో జగన్ తహతహ ఎందుకంటే?
Publish Date:Jul 28, 2023
Advertisement
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా అంత తొందరపడటం లేదు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలా, వ్యతిరేకంగా ఓటు వేయాలా అన్న విషయంలో జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కనీసం పార్టీ ఎంపీల సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించలేదు. అంతెందుకు ఇంకా కేంద్రం వైసీపీని కానీ, జగన్ ను కానీ, వైసీపీని కానీ కోరనే లేదు. అయినా జగన్ ఎక్కడ లేని తొందర ప్రదర్శించారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసేశారు. అంతేనా ఢిల్లీలో అధికారాల నియామక నియంత్రణను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను చట్టబద్ధం చేసేందుకు ఈ సమావేశాలలో ప్రవేశ పెట్టనున్న బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించేశారు. కనీసం కేంద్రం కోరే వరకూ కూడా ఎదురు చూడలేదు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ విధానాలపై కేంద్రం పెద్దలు, బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోవడం లేదు.. తనను కాదు అన్నట్లుగా దులిపేసుకుంటున్నారు. పై రెండు విషయాలలో జగన్ కేంద్రం వద్ద దాసోహం అన్నట్లుగా వ్యవహరించిన తీరును బట్టి చూస్తే కామన్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో కూడా జగన్ బేషరతు మద్దతు ఇచ్చేందుకు ఒక్క క్షణమైనా ఆలస్యం చేయరని అవగతమైపోతోందని పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి ఒక్క విజ్ణప్తి అయినా చేసేందుకు ధైర్యం చేయని జగన్ కేంద్రం కోరకుండానే మద్దతు ప్రకటించడం చూస్తుంటే.. ఆయనలోని బెదురు అవగతమౌతోందని అంటున్నారు. ఆ బెదురు కేంద్రానికి ఆగ్రహం వస్తే తనపై కేసుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందనేనని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కూడా గుర్తిస్తున్నట్ల కనిపించదు. తాను తనా అంటే తందానా అనే వ్యక్తి నేతృత్వంలో ఏపీలో ఉన్న ప్రభుత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఏముందన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరు ఉంది. ఇన్నేళ్లలో అంటే ఈ నాలుగేళ్ల కాలంలో బీజేపీ ఒక్క రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తప్ప మరే సందర్భంలోనూ జగన్ సర్కార్ మద్దతు కోరింది లేదు. అయితే బీజేపీ నోరెత్తి అడగాలా? నేను లేనూ అన్నట్లుగా జగన్ ప్రతి సందర్భంలోనూ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి మరీ ఉపసంహరించుకున్న రైతు చట్టాలకూ జగన్ బేషరతుగా మద్దతు ఇచ్చారు. వ్యవసాయ విద్యుత్ మోటార్ల విషయంలోనూ అంతే. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందుగానే జగన్ పాలిత ఏపీలో ఆ విధానాన్ని అత్యుత్సాహంగా అమలులోనికి తీసుకువచ్చి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కూడా అంతే మద్దతు కోసం బీజేపీ వైసీపీని కోరలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ బిల్లు వల్ల భవిష్యత్ లో తమ రాష్ట్రానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న ఆలోచనలో ఉన్నాయి. కానీ జగన్ కు అటువంటి ఆలోచన, ఆందోళనా ఇసుమంతైనా లేదు. మోడీ నిర్ణయించారు. నేను సరే అన్నాను అంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విపక్ష కూటమి ఇండియా పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని బీజేపీ ఇంకా అడగనైనా లేదు.. మీరు అడగాలా.. నాకు తెలియదూ అన్నట్లు జగన్ వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తారని ప్రకటించేశారు. ఏపీలో జనసేన జగన్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతే కాదు ఆ పార్టీ బీజేపీకి మిత్రపక్షం. కేంద్రం నుంచి ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఏపీలో ఉన్నది అవినీతి ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు. పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చేదేమీ లేదని కేంద్ర మంత్రులు కుండబద్దలు కొట్టేశారు. వైసీపీని కేంద్రం ప్రతి విషయంలోనూ కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నా.. జగన్ కు చీమ కుట్టినట్లైనా ఉండటం లేదు. అవసరానికి అప్పు... కేసుల నుంచి రక్షణ ఉంటే చాలు రాష్ట్రం ఏ గంగలో మునిగితే నాకేం అన్నట్లుగా జగన్ తీరు ఉంది.
http://www.teluguone.com/news/content/jagan-eagerness-to-support-bjp-25-159132.html





