మోదీ సర్కార్ కొత్త యుద్ధం!
Publish Date:May 6, 2025
Advertisement
అవును. ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు అన్నట్లు, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే వుంది. ఏప్రిల్ 22 న 26 మంది హిందువులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడి కూడా నడుస్తున్న యుద్ధంలో భాగమే. నిజానికి పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాల్లో కంటే.. గత 30 – 40 ఏళ్లకు పైగా పాకిస్థాన్ సాగిస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం, ఉగ్ర దాడుల వలన ఎక్కువ ప్రాణనష్టం జరిగిందన్నా ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త యుద్దానికి తెరతీశారు. కొత్త యుద్ద తంత్రాన్ని తెర మీదకు తెచ్చారు. అందుకే సరిహద్దుల అవతలి శత్రువులకే కాదు, అంతర్గత శత్రువులకు కూడా కంటి మీద కునుకు ఉండడం లేదు. అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అటు నుంచే కాదు ఇటు నుంచి కూడా సింధు జలాలను ఎలా ఆపుతారు? ఇప్పటికిప్పుడు డ్యాములు ఎక్కడ కడతారు? అసలు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం చేయడం ఏమిటి ? ఇది జల తీవ్ర వాదం కాదా? యుద్ధం ప్రభుత్వాలతో చేయాలి, సేనలు చేయాలి అంతే కానీ సామాన్య ప్రజలను నీరు లేకుండా చేయడం ఏమిటి? ఇది మానవత్వం అనిపించుకుంతుందా? అంటూ నిలదీసే వారు, ప్రశ్నించే వారు ఆ పని చేస్తూనే ఉన్నారు. అయితే.. ప్రధాని మోదీ వెయ్యేళ్ళ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలనే దృఢ సంకల్పంతో, అడుగులు వేస్తున్నారు. దాయాది దేశం పేరున దశాబ్దాలుగా శత్రు దేశం పాకిస్థాన్ సాగిస్తున్న ప్రచ్చన్న యుద్దాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు వ్యూహాత్మక యుద్దాన్ని సాగిస్తున్నారు. అందులో భాగంగ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. మోడీ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో యుద్ధం వస్తే దేశం వదిలి పారిపోతానని పాక్ మంత్రి బహిరంగంగా భయాన్ని వ్యక్త పరిచే స్థితికి తెసుకొచ్చిన మోదీ ప్రభుత్వం శత్రు దేశం బలహీనతలు లక్ష్యంగా దెబ్బ మీద దెబ్బ తీస్తోంది. అందులో భాగంగానే, జల యుద్ధానికి శ్రీకారం చుట్టింది. ఉభయ తారకంగా చీనాబ్ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టులకు మళ్లీ జీవం పోయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఇది కీలక ముందడుగు అంటున్నారు పరిశీలకులు. ఈ ప్రాజెక్టుల ద్వారా భారత్‌లో తన నదులపై హక్కులను బలోపేతం చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవి.. బర్సర్ డ్యామ్, కిరు డ్యామ్, కిర్థాయ్ డ్యామ్, రాట్లే డ్యామ్, పాకల్ దుల్ డ్యామ్, సావల్కోట్ డ్యామ్ ఉన్నాయి. ఈ ఆరు ప్రాజెక్టులు పూర్తయితే.. జమ్మూ కాశ్మీర్‌కు 10,000 మెగావాట్ల విద్యుత్తు అందనుంది. అంతేకాకుండా.. మైదాన ప్రాంతాలలో నీటిపారుదలతో పాటు గృహ వినియోగానికి సంబంధించి అధిక నీరు అందుబాటులోకి రానుంది. ఈ ఆరు ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, విద్యుత్ శాఖ మంత్రి ఎంఎల్ ఖట్టర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ సమావేశమై చర్చించిన విషయం విదితమే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గతంలో పాకిస్థాన్‌తో జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని ఏప్రిల్ 24న నిలిపివేసింది. ఒక్క చుక్క నీరు సైతం దేశ సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించడానికి వీలు లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ నదితో పాటు దాని ఉప నదుల ద్వారా పాకిస్థాన్‌లోని 80 శాతం వ్యవసాయానికి నీరందుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి యుద్ధం అంటే తుపాకులు, ఫిరగులే కాదు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు మాత్రమే కాదు, శత్రువును అష్ట దిగ్బంధనం చేసి పలాయనం చిత్త గించేలా చేయడమే ఆధునిక యుద్ధ నీతి, ఆధునిక యుద్ద తంత్రం. మోదీ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ముందస్తు వ్యూహాలతో యుద్ద సన్నాహాలు సాగిస్తోందనీ, విశ్వాసంతో ముందుకు సాగుతోందని యుద్ధరంగ నిపుణులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/modi-war-against-pakisthan-39-197545.html





