పొన్నవోలు అనుచరుడికి నామినేటెడ్ పోస్టు!
Publish Date:May 6, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నియమకాలు ఎలా జరుగుతున్నాయన్న అయోమయం నెలకొని ఉంది. వైసీపీ సానుభూతిపరులకు పదవులు కట్టబెట్టడం, ఆ తరువాత తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో జరిగిన పొరపాటు తెలుసుకుని నాలుక కరుచుకుని ఆ పదవి నుంచి సదరు సానుభూతి పరుడిని పీకేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అదేమిటంటే ఒక న్యాయ వాదికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. అలా కట్టబెట్టిన ఒక రోజులోనే ఆ పదవి నుంచి ఆ న్యాయవాదిని పీకేసింది. ఎందుకయ్యా అంటే ఆ న్యాయవాది వైసీపీయుడు కావడమే. అసలు ఏదీ చూసుకోకుండా, ఎవరికి ఏ పదవి కట్టబెడుతున్నామన్నది తెలియకుండానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నియామకాలు జరుగుతున్నాయా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక ప్రహసనంగా మారిందా అంటే తాజా పరిణామాన్ని గమనిస్తే ఔనన్న సమాధానమే వస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం, మిత్రపక్షాల నేతల కంటే వైసీపీ సానుభూతి పరులకే పెద్ద పీట వేస్తున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఒక న్యాయవాదిని ప్రభుత్వం కీలక నామినేటెడ్ పోస్టులో నియమించింది. ఆ తరువాత ఆ న్యాయవాది వైసీపీ సానుభూతిపరుడని పేర్కొంటూ కేటాయించిన నామినేటెడ్ పదవిని రద్దు చేసింది. విషయంలోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన న్యాయవాది జి. దినేశ్ కుమార్ రెడ్డిని ఎస్‌పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఆపరేషన్ సర్కిల్ బోర్డు లీగల్ కౌన్సిల్ (బీఎల్‌సీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకంపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే సదరు న్యాయవాది జగన్ హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పని చేసిన పొన్నవోలు అసిస్టెంట్ కావడమే. పొన్నవోలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన వైసీపీ నేతల కేసుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాదిస్తుంటారు. అటువంటి పొన్నవోలు అసిస్టెంట్ దినేశ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు కట్టబెట్టడమేంటి? అంటే తెలుగుదేశం శ్రేణులు ఓ రేంజ్ లో ఫైరయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి పేరిట అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అంగళ్లు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం, వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘటనలో చంద్రబాబు సహా వందలాది మంది టీడీపీ శ్రేణులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనల విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, దినేశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అసలే పొన్నవోలు అసిస్టెంట్, ఆపై చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసులు వాదించిన వ్యక్తికి ముందు వెనుకలు చూసుకోకుండా నామినేటెడ్ పోస్టు ఎలా కట్టబెట్టారన్న ఆగ్రహం, అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల నుంచి వ్యక్తం అయ్యింది. దీనిపై తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. దీంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్ ఈ వ్యవహారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన దీనిని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లడంతో దినేష్ కుమార్ నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దినేష్ కుమార్ నియామకం రద్దును స్వాగతిస్తూనే తెలుగుదేశం శ్రేణులు అసలా నియామకానికి సిఫారసు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పారు్టీ అధిష్ఠానం కూడా ఇదే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/nominated-post-to-ponnavolu-close-associate-39-197555.html





