ఆమెకి... పాత నోట్లపై ఎందుకంత 'మమత'?
Publish Date:Dec 2, 2016

Advertisement
మోదీ నోట్ల రద్దు నిర్ణయం పెద్ద దుమారం రేపింది దేశంలో! పార్లమెంట్లో కూడా నోట్ల రద్దు నానా హంగామాకి దారి తీస్తోంది! అయితే, నోట్ల రద్దు మిగతా అన్ని పార్టీలు, అందరు ముఖ్యమంత్రుల కన్నా మమత, కేజ్రీవాల్ ను మాత్రం తీవ్రంగానే ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది! ఎందుకోగాని... ఈ ఇద్దరూ పాత నోట్లను అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. ఆఖరుకు, కేరళ, త్రిపురలోని కమ్యూనిస్టు ముఖ్యమంత్రులు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కేసీఆర్, నవీన్ పట్నాయక్ లాంటి ఇతర ముఖ్యమంత్రులు ... ఎవ్వరూ చేయనంత ఉద్యమం మమత, కేజ్రీవాల్ ఇద్దరే చేస్తున్నారు. మోదీపై దుమ్మెత్తి పోస్తున్నారు!
సాధారణంగా మన దేశంలో చాలా మంది పొలిటీషన్స్ బ్లాక్ మనీతో డీల్ చేస్తుంటారు. వాళ్లకు పెద్ద నోట్ల రద్దు ఒకింత జీర్ణం కాని విషయమే. అయినా కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాస్తవ స్థితిని గ్రహించి గంభీరంగా పరిస్థితి చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. మోదీకి వ్యతిరేకంగా అనవసరంగా విమర్శలు చేయటం లేదు. ఒకటి అరా స్టేట్మెంట్ ఇచ్చి తమ పనిలో తాము పడిపోతున్నారు. కాని, ఎప్పటిలాగే మోదీని టార్గెట్ చేసిన కేజ్రీవాల్, కొత్తగా ప్రధాని బద్ధ శత్రువుగా మారిన మమత ఎంత మాత్రం నిశ్శబ్ధంగా వుండలేకపోతున్నారు. కేజ్రీవాల్ అయితే తన ఎన్నికల ప్రచారంలో ఎవరికైనా ఓటు వేయండి కాని బీజేపికి మాత్రం వద్దని చెప్పేదాకా వెళ్లిపోయాడు! అంటే... తన ఆప్ గెలవకపోయినా సరే కాని నరేంద్ర మోదీ బీజేపి మాత్రం గెలవటానికి వీల్లేదని ఆయన అభిప్రాయం!
మమత బెనర్జీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్రంపై విరుచుకుపడుతోంది. మరీ ముఖ్యంగా, మోదీ అంటే చాలు ఇల్లు పీకి పందిరేస్తోంది. ఏది జరిగినా జనం ముందు మోదీయే కారణమని నిరూపించే పనిలో పడిపోయింది. అందుకు చక్కటి ఉదాహరణ ఆమె ఫ్లైట్ ల్యాండింగ్ లో జరిగిన జాప్యం తాలూకూ రభసే! ఒక ప్రైవేట్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించిన ఆమె అందులో ఇంధనం తక్కువగా వుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పార్టీ ఎంపీలైతే పార్లమెంట్ స్థంభింపజేశారు. ఇది కేంద్రం కుట్ర అనేశారు. వాళ్ల ఆందోళన తప్పు పట్టాల్సింది కాకపోయినా... తరువాత సదరు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కంపెనీ ఇచ్చిన వివరణ వ్యవహారం మొత్తం నవ్వుల పాలయ్యేలా చేసింది! ఇంధనం తక్కువ వుండటం నిజం కాదని... కమ్యూనికేషన్ లో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త హడావిడి జరిగిందని తెలిపింది!
విమానం గొడవ సద్దుమణగక ముందే బెంగాల్ లో ఆర్మీ ఎందుకు కాలు పెట్టిందని సీరియస్ అయిపోయింది దీదీ. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా సైన్యం టోల్ గేట్ల వద్దకు రావడం అస్సలు అంగీకార యోగ్యం కాదంటూ మమత సచివాలయంలో బైటాయించింది. ఆర్మీ వెనకకు వెళితే తప్ప బయటకి రానంటూ మొండికేసింది. ఆమె అభ్యంతరం తప్పు కాకపోయినా సచివాలయంలో కూర్చుని బయటకి రాకుండా సీన్ క్రియేట్ చేయటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వంత భారతీయ సైన్యాన్ని చూసి మమత ఎందుకు అంత బెంబేలెత్తిపోతోంది? నిజానికి ఆర్మీ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అలాంటి డ్రిల్ అప్పుడప్పుడూ చేస్తూనే వుంటుందని ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇస్తూనే వుంది కూడా! అయినా కూడా మమత ఎందుకు రచ్చ చేస్తోంది?
కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన ప్రకారం శారదా స్కాం మమత బెనర్జీ ఫ్రస్ట్రేషన్ కి కారణమని తెలుస్తోంది. అందులో ఆమె అవినీతికి పాల్పడ్డారని, అదే ఇప్పుడు టెన్షన్ కి మూలమని చెబుతున్నారు. మోదీ ఒకవేళ సీబీఐని రంగంలోకి దింపితే మమత చుట్టూ అనేక కోణాల్లో ఉచ్చు బిగుసుకోవచ్చంటున్నారు. అది ఆమె రాజకీయ భవిష్యత్ కే దెబ్బ. అంతే కాదు, ఇప్పటికే మమత కమ్యూనిస్టుల్ని మట్టి కరిపించింది కాబట్టి తరువాత బలంగా ఎదుగుతోంది బీజేపి. అందుకే, మమత కమలాన్ని పెరికేసే పనిలో వుందంటున్నారు!
మమత బెనర్జీ మీద ఇప్పటి వరకూ అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. కాబట్టి ఆమె శారదా స్కాం లాంటి వాటి వల్ల భయపడుతున్నారని మనం నమ్మలేం. కాని, నోట్ల రద్దు వెనక్కి తీసుకోలేని నిర్ణయం , పైగా దేశ సంక్షేమానికి దీర్ఘ కాలంలో మంచి చేస్తుందని తెలిసి కూడా ఎందుకు వ్యతిరేకిస్తోంది? మోదీని రాజకీయాల్లోనే లేకుండా చేస్తానని శపథాలు ఎందుకు చేస్తోంది? ఇది ఆమెకే తెలియాలి. కాకపోతే, ఖచ్చితంగా తెలివైన రాజకీయం మాత్రం కాదు. ఆవేశంగానో, అసహనంతోనో ఆమె వేస్తోన్న తప్పటడుగు. మమత కాస్త ప్రశాంతంగా తన వ్యూహాల్ని పునరాలోచించుకోవాల్సిన సమయం ఇది...
http://www.teluguone.com/news/content/modi-37-69791.html












