నమో సక్సెస్ అవుతున్నాడా? లేక అపోజిషన్ ఫెయిలవుతోందా?
Publish Date:Dec 1, 2016
Advertisement
పదేళ్లు మన్మోహన్ సింగ్ లాంటి మౌన ప్రధానితో అలవాటు పడ్డ భారతీయులకి మోదీ మార్క్ పరిపాలన జీర్ణం కావటం లేదు. ఆయన చేసే పనులు మంచివా, చెడ్డవా అనే వాదనలు తరువాత... అసలు ఆయన ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాక కన్ ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది! సొషల్ మీడియాలో మోదీ భక్తులుగా పిలవబడే హార్డ్ కోర్ ఫ్యాన్స్ నమోని ఎలాగూ సమర్థిస్తారు. వాళ్లని పక్కన పెట్టేస్తే మధ్యస్థంగా వుండేవాళ్లు, మోదీ వ్యతిరేకులు ప్రధాని చర్యలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. మరీ ముఖ్యంగా, విపక్ష నేతలు అందరికందరూ డైలామాలో పడిపోతున్నారు. దీనికి కారణం, మోదీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ఢిల్లీలో కొనసాగుతూ వచ్చిన గేమ్ రూల్స్ అన్నీ మార్చేయటమే! ఆయన ఆట తనకి నచ్చినట్టు ఆడేస్తున్నాడు...
మోదీ ప్రధాని అయ్యాక ఆయన దేశ దేశాలు తిరగటం మొదలు స్వచ్ఛ్ భారత్ కు పిలుపునివ్వటం, జన్ ధన్ ఖాతాలు ... ఇలా చాలా అంశాలు విమర్శల్లోకి వచ్చాయి. ప్రతీ సారి ఆయనంటే పడని వారు విరుచుకుపడటం, సమర్థించే వారు చెలరేగిపోయి మద్దతివ్వటం జరుగుతూనే వుంది. ప్లానింగ్ కమీషన్ ని నీతీ ఆయోగ్ గా మార్చటం లాంటి కీలక నిర్ణయాలకి, జీఎస్టీ లాంటి బిల్లులకి ఆయన మీద ఆరోపణలు చేస్తే అంతా బాగానే వుండేది. కాని, మీడియా, ప్రతిపక్షాలు, ఒక వర్గం మేధావులు ప్రతీ చిన్న అంశం రచ్చ చేయటం మొదలు పెట్టారు. ఆఖరుకి ఆయన వేసుకున్న కోటు కూడా పెద్ద కొట్టాటకు దారి తీసింది. మోదీ ఆ వివాదాస్పద కోటునే వేలం వేసి అందరి నోళ్లకు తాళం వేశాడు. ఇలా ప్రతీ సారి మోదీపై కోపంతో ఆయన ప్రత్యర్థులు సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు. అందుకు, చక్కటి ఉదాహరణలు పదే పదే వస్తోన్న ఎన్నికల ఫలితాలు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్సే అంతిమ లిట్మస్ పరీక్ష కదా...
బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన మోదీ అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే స్థానిక, ఉప ఎన్నిక, సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ, బీజేపిని గెలిపిస్తూ వస్తున్నాడు. ఇది ఆయన పట్ల జనంలో చెక్కుచెదరకుండా వుంటోన్న నమ్మకానికి నిదర్శనం. అదే ఇప్పుడు డీమానిటైజేషన్ తరువాత కూడా జరుగుతోంది. ఒకవైపు మమత బెనర్జీ తాను మోదీని రాజకీయాల్లోనే లేకుండా చేస్తానని కంకణం కట్టుకుంటే మరో వైపు అరవింద్ కేజ్రీవాల్ క్యూలైన్లలో వందల మంది చనిపోయారని వాపోతున్నాడు. రాహుల్ అయితే ఏటీఎంల వద్దకొచ్చి నానా హంగామా చేస్తున్నాడు. మన సీపీఐ నారాయణ లాంటి లోకల్ నాయకులైతే మోదీని ఉరి తీయాలి లాంటి బాంబులు పేలుస్తున్నారు. మీడియా ఛానల్స్ కూడా అలుపెరగక జనం బ్యాంకుల ముందు పడుతున్న కష్టాల్ని లైవ్ లో చూపిస్తున్నాయి. ఇంత జరిగినా మహారాష్ట్ర, గుజరాత్ ఎన్నికల్లో భారీ విజయాలు వరించాయి మోదీ సేనని! ఇది దేనికి సంకేతం?
చిన్నా చితక ఎన్నికల్లో గెలిచిస్తే 2019 సాధారణ ఎన్నికల్లో కూడా మోదీ గెలుస్తాడని అర్థం కాదు. రెండో సారి ప్రధాని అవుతాడని భరోసా లేదు. కాని, ఆయన్ని వ్యతిరేకించే వారు ఫెయిల్ అవుతున్నది ఆయన వల్ల జనానికి కలిగిన నష్టం అర్థమయ్యేలా చెప్పటంలో! ప్రతిపక్ష నేతలు, మీడియా అంతా జనం ఇబ్బందుల గురించే మాట్లాడుతున్నారు. కాని, పరిష్కారాలు వారి వద్ద కూడా లేవు! ఇక మమత బెనర్జీ, కేజ్రీవాల్ చెప్పినట్టు ఇప్పుడు పాత 500, 1000 నోట్లు తిరిగి వాడుకలోకి తేవటం అసాధ్యం. అలా జరగాలని మామూలు జనం కూడా కోరుకోవటం లేదు! మరి ఇలాంటి పరిస్థితుల్లో ఊరికే మోదీని తిట్టిపోసే నేతల వల్ల జనానికి ఏం లాభం? అందుకే వారు నరేంద్ర మోదీని మరింత నమ్ముతున్నారు. మంచికో, చెడుకో ఆయన సాహసం చేసి నోట్లు రద్దు చేశాడు. తరువాత జరగాల్సిన ఏర్పాట్లు సరిగ్గా జరగలేదు. జనం తీవ్ర ఇబ్బందులే పడ్డారు. పడుతున్నారు. అయినా కూడా మోదీ నల్లధనం పై తాను చేస్తోన్న పోరులో రోజుకో కొత్త నిర్ణయంతో దూసుకుపోతున్నాడు. ఎక్కడికక్కడ బ్లాక్ మనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని సామాన్యులకి నమ్మకం కలిగిస్తున్నాడు. ఇదే ఆయన సక్సెస్ కి సీక్రెట్ అనుకోవాలి...
అమాంతం 86శాతం కరెన్సీ మార్కెట్లోంచి మాయమైపోతే కష్టం ఖచ్చితంగా వుంటుంది. కాని, ఆ కష్టం తాత్కాలికమని జనం భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే తెలంగాణలోని సిద్దిపేట రైతు బజార్లో ప్రభుత్వం స్వైప్ మిషన్ ఏర్పాటు చేసింది. లావాదేవీలు నోట్లు అక్కర్లేకుండా జరుగుతున్నాయి. అటు గుజరాత్ లోని పెద్ద పెద్ద గుళ్లలో హుండీల్లో వేసే సొమ్ము ఇప్పుడు స్వైప్ మిషన్ల ద్వారా దేవుడికి చెల్లిస్తున్నారు! తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎన్డీఏలో లేని ముఖ్యమంత్రి, గుజరాత్ లాంటి రాష్ట్రంలో బీజేపి ముఖ్యమంత్రి అంతా ప్రజల కోసం చేయగలిగింది చేస్తున్నారు. ఆల్రెడీ ఇండియా డిజిటల్ ఇండియాగా మారే క్రమం మొదలైపోయింది. కొన్ని రోజుల కిందటి కంటే ఇప్పుడు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయాయి! ఒక భారీ మార్పు కోసం దేశమంతా అయిష్టంగానైనా ముందుకు సాగుతోంది. ఈ అనివార్యతే మోదీ వ్యతిరేకుల కంటే మోదీని రేసులో వుంచుతోంది...
http://www.teluguone.com/news/content/modi-37-69732.html





