చేటు చేసే మందా? మంచి చేసే చేదు మందా?
Publish Date:Dec 3, 2016
Advertisement
నోట్ల రద్దు నిర్ణయం జిరిగి అటు ఇటుగా నెల కావస్తోంది. మరి ఈ మూడు, నాలుగు వారాల్లో జరిగిందేమిటి? నల్లదనం వెలికి వస్తుందని, దొంగ నోట్లు చెత్త కుండీల్లో, నదుల్లో, చెరువుల్లో కట్టలుకట్టలుగా కనిపిస్తాయని జరిగిన ప్రచారం అంతా ఒట్టిదేనా? డీమానిటైజేషన్ లోని మంచి సంగతి దేవుడెరుగు, చెడు మాత్రం కామన్ పీపుల్ని కాటేసిందా? కాళ్లు అరిగేలా క్యూలలో నిలబడ్డ వాళ్లకు నష్టం తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు బోలెడు వస్తున్నాయి. పనిలో పనిగా బంగారం విషయంలో మీడియా చేస్తున్న హడావిడి మరింత నిరాశ కలిగిస్తోంది. ఇళ్లలో, ఒంటి మీదా, బ్యాంక్ లాకర్లలో వున్న బంగారం కూడా మోదీ వచ్చి ఎత్తుకుపోతాడు అన్నట్టు వుంది వ్యవహారం. లేడీస్ ముందు మైక్ లు పెట్టి వీలైనంత తిట్టిపోయిస్తున్నారు! కాని, నోట్ల రద్దు నిజంగానే ఒక తుగ్లక్ చర్యా? మోదీ అన్ పాప్యులర్ అవ్వటం దీనితోనే ప్రారంభమైందా?
పెద్ద నోట్ల రద్దు చిన్న విషయం కాదు. అందుకే, చాలా పెద్ద వ్యవహారమైన పెద్ద నోట్ల రద్దు అందరికీ పెద్ద అయోమయంగా మారిపోయింది. ఒక్కోసారి మోదీ ప్రభుత్వానికి కూడా ఏం జరుగుతుందో అర్థం కావటం లేదేమో అనిపిస్తుంది. అలా వుంది కన్ ఫ్యూజన్! కాని, డీమానిటైజేషన్ ప్రచారం జరుగుతోన్నంత బ్యాడ్ ఐడియా కాదు. చాలా మంచి కోణం అందులో దాగి వుంది. కాని, పాలు తోడేసిన వెంటనే పెరుగైపోదన్నట్టు... కాస్త టైం పట్టే అవకాశం వుంది. అంత వరకూ మాత్రం బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్యుల క్యూ లైన్లే కనిపిస్తాయి. ప్రతిపక్షాల అరుపులు, కేకలే వినిపిస్తాయి. కాని, స్లోగా నోట్ల రద్దు గుడ్ ఎఫెక్ట్ అనుభవంలోకి వస్తూనే వుంది. దాన్ని గుర్తించగలిగితే భయం, అయోమయం తగ్గే అవకాశం వుంది.
తాజా మార్కెట్ ట్రెండ్ ని చూస్తే బంగారం ధర తగ్గుతోంది. ఇంకా తగ్గే ఛాన్స్ కూడా వుందంటున్నారు మార్కెట్ ఎక్స్ పర్ట్స్. దీనికి కారణం బంగారు నిల్వలు, ఎగుమతులపై అమెరికా, చైనా తీసుకునే నిర్ణయాలే. అయితే, మన దేశంలో జరుగుతోన్న నోట్ల రద్దు తదనంతర పరిణామాలు కూడా గోల్డ్ పై ఎఫెక్ట్ చూపుతున్నాయి. గవర్నమెంట్ బ్లాక్ మనీతో కొనే బ్లాక్ గోల్డ్ ను ఓ కంట గమనిస్తోందని తెలియగానే కొనుగోళ్లు తగ్గాయి. నిజానికి పెద్ద నోట్లు రద్దు కాగానే చాలా మంది బంగారు బిస్కెట్లే బెటర్ అనుకున్నారు. కాని, ఇప్పుడు వాటికి కూడా లెక్కలు చెప్పాలనటంతో గోల్డ్ సేల్స్ తగ్గిపోయాయి. ఫలితంగా ధర కూడా తగ్గుతూ వస్తోంది. ముందు ముందు ఇంకా తగ్గితే కామన్ పీపుల్ కొనుక్కునే నగలు మరింత చౌకగా మారతాయి.
బంగారం బాటలోనే పయనిస్తోంది రియల్ ఎస్టేట్. నోట్లు రద్దు కాక ముందు విపరీతంగా ధర పలికిన భూముల ఇప్పుడు మధ్య తరగతి వారికి అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే, బ్యాంక్ లోన్లు తక్కువ వడ్డీకి లభిస్తే రియల్ లాభాలు బోలెడు వుంటాయి. భారీగా డిపాజిట్లు జరగటం వల్ల ముందు ముందు తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ ఇస్తారని ఆల్రెడీ నిపుణులు చెబుతున్నారు. అంటే, మిడిల్ క్లాస్ స్వంత ఇంటి కల ఇక ముందు మరింత తేలిగ్గా సాకారం కానుందన్నమాట!
బంగారం, ఇల్లే కాదు... నోట్ల రద్దు సత్ ఫలితాలు ఇంకా అనేక రంగాలపై పడుతున్నాయి. ఉదాహరణకి, భీమా రంగమే తీసుకోండి... నోట్లు రద్దయ్యాక చాలా మంది పాలసీలు చేయించటం మొదలెట్టారు. ఇంత కాలం ట్యాక్స్ లు కట్టకుండా మూలుగుతున్న ధనం రకరకాలుగా బయటకు వస్తోంది. ముంబైలోని ఒక వ్యాపారి అయితే ఏకంగా 50కోట్ల ప్రీమియం కట్టాడట ఎల్ఐసీకి! దేశంలో అతి పెద్ద ప్రీమియం అమౌంట్ ఇప్పటి వరకూ ఇదేనట! ఓ బాలీవుడ్ హీరో కూడా 2కోట్ల ప్రీమియంతో పాలసీ తీసుకున్నాడట. ఇక పోయిన నెల చివరి రోజున ఒకే రోజు జీవన్ అక్షయ్ అనే పాలసీ కోసం ఎల్ఐసీకి 2300కోట్లు వసూలయ్యాయట! ఇంత భారీగా కలుగుల్లో దాక్కున్న సొమ్ము బయటకి రావటం... కనీస ఆర్దిక శాస్త్రం తెలిసిన ఎవరికైనా లాభదాయకంగానే కనిపిస్తుంది!
అనూహ్యంగా నోట్లు రద్దు చేసిన తరువాత ఇబ్బందులు వున్న మాట ఎంత వాస్తవమో , ముందు ముందు రాబోయే లాభాలు కూడా అంతే నిజం. కేవలం నల్లధనం పైనే చర్చ చేస్తూ ఇతర లాభాలు, వివిధ రంగాలపై కలిగే లాభసాటి ప్రభావాలు చర్చించకపోవటం పెద్ద తప్పే అవుతుంది! ఈ సత్యం ముఖ్యంగా గ్రహించాల్సింది మెయిన్ స్ట్రీమ్ మీడియా...
http://www.teluguone.com/news/content/modi-37-69851.html





