మీరు ఐటీనా... ఐతే ఈ గుడ్ న్యూస్ మీకే!
Publish Date:Nov 30, 2016
Advertisement
తెలుగు రాష్ట్రాలు... మరీ ముఖ్యంగా, హైద్రాబాద్ అంటే ఎవరికైనా వెంటనే ఏం గుర్తుకు వస్తుంది? ఐటీనే కదా! అసలు ఐటీ రంగం హైద్రాబాద్ లో పురి విప్పిన తరువాత మన నగరం రూపే మారిపోయింది. అంతలా ఐటీ హైద్రాబాద్ ని ఛేంజ్ చేసింది. ఇన్ ఫ్యాక్ట్, కేవలం భాగ్యనగరాన్నే కాదు మొత్తం దేశాన్ని ఐటీ రంగం ఇప్పుడు శాసిస్తోంది. ఇంకా ఎన్ని రంగాలు వున్నా ఐటీ, దాంట్లో లభించే జాబ్స్ అంటే జనానికి భలే క్రేజ్. అయితే, 2017 ఫస్ట్ హాఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ కి పండగేనంటున్నారు ఎక్స్ పర్ట్స్....
ఐటీ రంగం అమాంతం అభివృద్ధి అయింది మన దేశంలో. అందులోకి తొలి నాళ్లలో ప్రవేశించిన వారు ఇప్పుడు సాలిడ్ గా సెటిలైపోయారు. తరువాత కూడా లక్షలాది మంది కంప్యూటర్ల ముందు కూర్చుని వేలాది రూపాయల జీతాలు సంపాదించారు. కాని, గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్దిక సంక్షోభం పుణ్యామాని ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ పెద్దగా ఇరగదీయటం లేదు. ముఖ్యంగా ఇండియాలో ఐటీ స్లో అవ్వడం చాలా ప్రభావమే చూపింది. కొంత వరకూ కంప్యూటర్ కలల్ని తగ్గించేసింది కూడా. సీఏలు, డాక్టర్లు అవ్వాలని, సివిల్స్ లో ర్యాంకులు కొట్టాలని ప్రయత్నించే వాళ్లు ఎక్కువైపోయారు! కాని, ఐటీనే నమ్ముకుని మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వారికి గుడ్ టైమ్స్ ఆర్ బ్యాక్....
2016 డిసెంబర్ నుంచి 2017 మార్చ్ మధ్య దేశంలోని వందలాది ఐటీ కంపెనీలు ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నాయట. అయితే, ఇలా కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగాలు భర్తీ చేయటం కొత్తేం కాదు. కాని, ఈసారి ఏకంగా 76శాతం కంపెనీలు కొత్త వార్ని తమ క్యాంపస్ లలోకి ఆహ్వానించనున్నాయట! ఈ విషయం ఎక్స్‌పెరిస్ ఐటీ మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా సర్వే వెల్లడించింది. దాని ప్రకారం దేశంలోనే అత్యధికంగా 34శాతం ఐటీ ఉద్యోగాలు దక్షిణాదిలో భర్తీ కానున్నాయట! మిగిలిన 66శాతం దేశంలోని ఇతర ప్రాంతాల్లో పూరిస్తారట. అంటే, హైద్రాబాద్, బెంగుళూరు లాంటి ఐటీ హబ్స్ లో భారీ ఎత్తున ఉద్యోగాలు చేతికందే అవకాశం వుందన్నమాట...
కొత్తగా లభించే ఉద్యోగాల్లో కొంత ఎక్స్ పీరియన్స్ వున్న వారికి పెద్ద పీట వేసే అవకాశం కూడా వుందట. 3 నుంచి 8 ఏళ్ల అనుభవం వున్న వారికి మరింత మంచి ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. మరో వైపు, ఐటీ రంగంలో చాలా మందికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతోంటే సగం కంపెనీలకు అవసరమైన నిపుణులే దొరకటం లేదట! అంటే, సర్టిఫికెట్లు కాకుండా టాలెంట్ కూడా వున్న వారు తక్కువగా వుంటున్నారన్నమాట! సో... మీరు ఐటీ రంగంలోని వారు, కాస్త అనుభవం వున్న వారు, అంతకు మించి టాలెంట్ కూడా వున్న వారైతే... 2017 మార్చ్ లోపు చక్కటి ఆఫర్ ఖచ్చితంగా ఆశించవచ్చన్నమాట!
http://www.teluguone.com/news/content/information-technology-37-69665.html





