యూట్యూబర్ అన్వేష్ పై లుక్ ఔట్ నోటీసులు
Publish Date:Feb 25, 2026
Advertisement
సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో వీడియోలు ప్రచారం చేసిన ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్‌పై హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీసులు కీలక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇటీవల అన్వేష్ ఖాతాను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, రెండు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని పేర్కొంటూ ఆయన మరో వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసును మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు అధికారికంగా సమాచారం ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. అన్వేష్‌కు చెందిన ఖాతాల వివరాలు, వీడియోల కంటెంట్, ఫాలోవర్ల సమాచారం వంటి అంశాలపై డేటా కోరుతూ లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. డిజిటల్ ఆధారాలను సేకరించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. అన్వేష్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలుమార్లు అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి ప్రజల్లోకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందిస్తూ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/look-out-notice-on-you-tuber-anvesh-36-214656.html





