చంద్రబాబు వ్యూహం.. జాతీయ నేతగా లోకేష్ అడుగులు!
Publish Date:Nov 10, 2025
Advertisement
రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ముందు ముందు జాతీయ స్థాయిలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించానున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే తన పనితీరుతో లోకేష్ రాష్ట్రంలో అన్ని వర్గాలకూ చేరువ అయ్యారు. గతంలో విమర్శలు చేసిన వారు కూడా ఇప్పుడు లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయంగా పరిణితి చెందారన్న అభిప్రాయమూ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ఇటు ప్రభుత్వంలోనూ, అటు తేలుగుదేశం పార్టీలోనూ తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. ఇక ప్రజలలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరో లెవల్ కు చేరింది. ప్రజానాయకుడిగా జనం ఆయనను భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం భవిష్యత్ నాయకుడిగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకూ లోకేష్ అన్ని వర్గాల, అన్ని పార్టీల నుంచీ కూడా మంచి నేతగా గుర్తింపు పొందారు. ఇక ఇప్పుడు ఆయనను జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడిగా నిలబెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హస్తిన, ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఆయనకు గుర్తింపు లభించేలా ఒకదాని వెంట ఒకటిగా లోకేష్ వేస్తున్న అడుగుల వెనుక చంద్రబాబు స్ట్రాటజీ ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ లోకేష్ అడగకుండానే అప్పాయింట్ మెంట్లు ఇస్తున్నారు. అలాగే కేంద్ర కేబినెట్ లోని పలువురు మంత్రులతో లోకేష్ కు మంచి పరిచయాలు, అనుబంధం, సాన్నిహిత్యం ఏర్పడింది. తరచుగా వారి సూచనలు, సలహాలూ తీసుకుంటూ వారికి చేరువ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా తాను వెళ్లకుండా లోకేష్ ను పంపించారు. అక్కడ ఆయన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. బీహార్ ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సహా పలువరు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అంతటి కీలకమైన బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి నారా లోకేష్ వెళ్లడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రచారం ఆయనకు జాతీయ నేతగా వస్తున్న గుర్తింపును మరో మెట్టు పైకి తీసుకువెడుతుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/lokesh-steps-towards-national-leader-45-209253.html





