కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీలో సమర్ధన.. మింగలేక కక్కలేక వైసీపీ యాతన
Publish Date:May 1, 2022
Advertisement
కల్వకుంట్ల తారకరామారావు డైనమిక్ యంగ్ పొలిటీషియన్ అని రోజా వంటి నేతల ప్రశంసలు అందుకున్న తెలంగాణ మంత్రి. ఒక్క మాటతో ఆయన ఏపీలో రాజకీయ దుమారం లేపేశారు. లేదు లేదంటూనే ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేశారు. ఏపీలో సౌకర్యాలపై సెటైర్ వేయడం ద్వారా తెలంగాణవైపు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి పెంచుకునేలా చేసుకున్నారు. కేసీఆర్ ఏపీలో విద్యుత్, రోడ్లు, నీళ్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీతో పోలిస్తే తెలంగాణలో సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకోవడానికే. ఏపీలో లేవని చెప్పడం ద్వారా ఆయన చిన్నగీత, పెద్దగీత సిద్ధాంతాన్ని వాడుకున్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నాయకుల స్పందన తీరు చూస్తే వారి పరిస్థితి మింగలేక..కక్కలేకా చందంగా తయారైందని అవగత మౌతుంది. ఎవరంగీకరించినా, అంగీకరించకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తరువాత నుంచి రెండు రాష్ట్రాలలో రాజకీయాలు కంపేరిజంపైనే ఆధారపడి ఉన్నాయి. సెంటిమెంటు అనుకున్నా...రాజకీయ అనివార్యత అనుకున్నా..ఒక దాని కంటే ఒకటి అభివృద్ధి, సంక్షేమంలో ముందున్నామని ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలన్నదే ఇరు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీల తాపత్రేయంగా ఉంది. 2019కి ముందు వరకూ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అన్ని విషయాలలోనూ ఇరు రాష్ట్రాల మధ్యా పోటాపోటీ వాతావరణం ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలంగాణ స్పీడ్ పెరిగితే..ఏపీ అభివృద్ధి గ్రాఫ్ దిగజారింది. అధికారిక గణాంకాలే ఈ విషయాన్ని స్పష్ట చేస్తున్నాయి. ఏపీలోని జగన్ సర్కార్ పూర్తిగా ఫ్రీ బీస్ మీద ఆధారపడి వచ్చే ఎన్నికలలో విజయానికి అవే శ్రీరామరక్ష అని భావిస్తూ ముందుకు సాగుతుంటే.. తెలంగాణ సర్కార్ అభివృద్ధి, సంక్షేమం, సెంటిమెంట్ అంటోది. ఈ నేపథ్యంలోనే తెలంగాణను ఏపీతో కంపేర్ చేస్తూ ప్రమోట్ చేసుకోవడానికి కేటీఆర్ క్రెడాయ్ సదస్సు వేదికను వినియోగించుకున్నారు. ఒకే సమయంలో అటు పెట్టుబడి దారులను ఆకర్షించడం, ఇటు ప్రజలలో ఏపీతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందన్న భావన క్రియేట్ చేయడం. తెలంగాణ ప్రజలలో కేటీఆర్ మాటల ప్రభావం ఎంతుందో తెలియదు కానీ, ఏపీలో మాత్రం కేటీఆర్ మాటలు దుమారమే లేపాయి. విపక్ష తెలుగుదేశం సహా వైసీపీ యేతర పార్టీలన్నీ కేటీఆర్ మాటలు అక్షర సత్యాలని ప్రకటిస్తూ...జగన్ సర్కార్ ప్రతిష్ట దెబ్బతినేలా తెలంగాణ అభివృద్ధిని పరోక్షంగానైనా సరే ఏపీ ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. సీపీఐ నారాయణ, వైసీపీ రెబల్స్ రఘురామరాజు, డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి వారైతే ఒక అడుగు ముందుకు వేసి మీడియా సమావేశాలలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు కూడా ఇచ్చేశారు. దీంతో కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా కూడా ఏపీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఏపీ వెనుకబాటు తనం కేటీఆర్ మాటల సాక్షిగా ప్రజలలోకి వెళ్లిపోయింది. ఇప్పుడిక వైసీపీ సర్కార్ నష్ట నివారణకు తెలంగాణలో లోటుపాట్లను ఎత్తి చూపడంతో పాటు...ఏపీ ప్రగతికి తానేం చేసిందో చెప్పుకోవలసిన పరిస్థితిలో పడింది. ఇంత జరిగినా ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపక పోవడం పరోక్షంగా కేసీఆర్ మాటలకు బలం చేకూర్చేదిగానే ఉంది.
http://www.teluguone.com/news/content/ktr-gets-suppourt-in-ap-on-his-comments-25-135309.html





