శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ.. ఏపీ బీహార్ ను మించిపోయిందిగా!
Publish Date:May 1, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ నేరాల హబ్ గా మారిందా?.. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందా? ఒకప్పుడు బీహార్ లో ఉండే పరిస్థితులను మించి ఇప్పుడు ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి అవుననే సమాధానం వస్తుందని పరిశీలకులు అంటున్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు ఏపీలో రోజువారీగా జరిగే సాధారణ సంఘటనల్లా మారిపోయాయి. నేరస్తులు యధేచ్ఛగా తిరుగుతున్నారు. దారుణాలన్నిటికీ వీడియో సాక్ష్యాలు బయటపడుతున్నా పోలీసులు చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక్కో సారి అయితే.. ఎలాంటి దర్యాప్తూ జరపకుండానే నిందితులను వెనకేసుకొచ్చేలా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. దీంతో పోలీసులు నిందితులను వెనకేసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోరా? అంటూ జనాగ్రహం వెల్లువెత్తుతున్నా పోలీసులలో కదలిక ఉండటం లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా రోజూ ఏదో ఒక అత్యాచారం, హత్య, దాడుల కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఏపీలో నేరస్తులకు తామేం చేసిన ఏమీ కాదు, శిక్షలు ఉండవు అన్న భరోసా ఏర్పడినట్లుగా భావించాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అరాచకం పరాకాష్టకు చేరితేనే పరిస్థితి ఇలా తయారౌతుందని వారు విశ్లేషిస్తున్నారు. గతంలో బీహార్ లో ఇటువంటి పరిస్థితి ఉండేదనీ, ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు బీహార్ ను తలదన్నేలా క్షీణించాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకదాని తరువాత ఒకటిగా మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు, దాడులు, హత్యల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా విజయనగరంలో ఓ యువతిని హత్య చేసి పెట్రోల్ పోలి కాల్చేశారు. రేపల్లె రైల్వే స్టేసన్ లో వలస కూలీపై సామూహిక అత్యాచారం..ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు నాలుగైదు సంఘటనలు రాష్ట్రంలో వెలుగులోనికి వస్తున్నాయి. ఏ సంఘటనలోనూ నిందితులను అరెస్టు చేసిన దాఖలాలు కానీ, దిశ చట్టం కింద కేసులు నమోదు చేసిన దాఖలాలు కానీ లేవు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని 21 రోజులలో విచారించి శిక్షిస్తామంటూ సీఎం జగన్ ఘనంగా చేసిన ప్రకటన గాలి మూటగానే మిగిలిపోయింది.
అసలు మహిళలపై అత్యా చారాల సంఘటనల్లో నిందితులను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం సంగతి అటుంచి పోలీసులు వారికి వత్తాసుగా నిలబడుతున్నారా అన్నట్లుగా పరిస్థితి ఉందనీ, అందుకే నేరస్తుల్లో తమకు ఏం కాదు, కేసులు, శిక్షలు ఉండవన్న బరోసా పెరిగిపోయిందనీ పరిశీలకులు చెబుతున్నారు. వివాహితపై హత్యాచారం ఘటనలో పోస్టుమార్టం జరగకముందే అత్యాచారం జరగలేదంటూ ఎస్పీ ప్రకటన, అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగిందంటూ అదేం పెద్ద నేరం కాదన్నట్లుగా ఇచ్చిన వివరణను ఇందుకు వారు ఉదాహరణగా చూపుతున్నారు. వ్యవస్థ నిలబడుతుంది. గుంటూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రోజుకో రేప్ జరుగుతున్నా పోలీసులలో కదలిక కనిపించడం లేదు. బాధితుల పక్షాన తెలుగుదేశం, ఇతర విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భద్రత లేని రాష్ట్రంలో ఉండలేక మహిళలందరూ వేరే రాష్ట్రాలకు తరలివెళ్లే పరిస్థితులు వస్తాయని విపక్ష నాయకుడు నారా లోకేష్ అన్నారు. ఏది ఏమైనా పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించకుంటే.. ప్రజలే తిరగబడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించే పరిస్థితి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/no-existence-of-law-and-order-25-135311.html





