మంచిర్యాలలో మరో అంబులెన్స్ మాఫియా- మృతదేహం తరలింపునకు రూ. 80 వేలు
Publish Date:May 1, 2022
Advertisement
సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మనిషిని కష్టాన్ని సానుభూతితో చూడటం మాని కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. డబ్బే ముఖ్యమన్నట్లుగా ప్రవర్తిస్తూ విలువలకు తిలోదకాలిస్తున్నారు. ఆఖరికి ఆపదలో ఆదుకునే అంబులెన్స్ డ్రైవర్లు సైతం కాసుల కక్కుర్తికి పాల్పడుతున్నారు. మానవ సమాజం సిగ్గపడే ఘటన ఒకటి మంచిర్యాలలో చోటు చేసుకుంది.
తిరుపతి రుయా అంబులెన్స్ మాఫియా అమానుషత్వం ఘటన మరువక ముందే.. దాదాపుగా అలాంటి అమానవీయ ఘటనే మంచిర్యాలలో జరిగింది. తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో అంబులెన్స్ మాఫియా అడిగినంత ఇచ్చుకోలేని ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని స్కూటర్ పై 90 కిలో మీటర్ల దూరంలోని తన స్వగ్రామానికి తీసుకువెడితే.. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద అంబులెన్స్ డ్రైవర్ అడిగినంత ఇచ్చుకోలేని మృతుడి బంధువులు మృత దేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లి పోయారు.
వివరాల్లోకి వెడితే ఉత్తర ప్రదేశ్ కు చెందిన వలస కూలీ మంచిర్యాలలో వడ దెబ్బతో శనివారం మంచిర్యాల ఆసుపత్రిలో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వెళ్లి కుటుంబ సభ్యులకు చివరి చూపు దక్కేలా చేద్దామని మృతుని కుటుంబ సభ్యులు అంబులెన్స్ డ్రైవర్లు షాక్ ఇచ్చారు. మృతదేహాన్ని తరలించేందుకు రూ.80 వేలు డిమాండ్ చేశారు. రెక్కాడితే డొక్కాడని బడుగు జీవులన్న కనికరం లేకుండా అణా పైసలతో సహా అంత డబ్బూ చెల్లిస్తేనే మృత దేహాన్నితరలించేది లేదని భీష్మించారు. బతిమాలుకున్నా ఫలితం లేకపోవడంతో మృతుడి బంధువులు మృత దేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ప్రభుత్వాసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియాలపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వాలలో చలనం లేకపోవడం వల్లనే తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ambulance-mafia-im-manchryal-demands-80-thousand-to-move-dead-body-25-135305.html





