కోమటిరెడ్డి & బ్రదర్స్ ఇంకా ఎంత కాలం డైలెమాలో ఉంటారో?
Publish Date:Oct 17, 2015
Advertisement
నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల్లో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రముఖులు. వారిలో వెంకట రెడ్డి మాజీ మంత్రికాగా, రాజగోపాల్ రెడ్డి మాజీ ఎంపి. అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కె.జానారెడ్డితో వారికి తీవ్ర విభేదాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అవి పెద్ద సమస్యగా కనబడలేదు. పైగా తెలంగాణా ఉద్యమాలు జోరుగా జరుగుతున్నందున వారి విభేదాలు మరుగునపడ్డాయి. తెలంగాణా సాధన కోసం కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి నిరాహార దీక్షలు కూడా చేసారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది కానీ తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కనుక మళ్ళీ ఇప్పుడు వారి మధ్య విభేదాలు మెల్లగా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జానారెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ తమని పట్టించుకోవడంలేదని వారు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. బహుశః ఆ కారణంగానే కోమటిరెడ్డి సోదరులిద్దరూ కాంగ్రెస్ పార్టీకి, దాని కార్యక్రమాలకి చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. కోమటిరెడ్డి సోదరులిద్దరినీ తెరాసలోకి ఆకర్షించాలని కేసీఆర్ ప్రయత్నించినట్లు, అందుకు వారిద్దరూ కూడా సానుకూలంగానే ఉన్నట్లుగా ఆ మధ్యన ఎప్పుడో వార్తలు వచ్చేయి. కానీ ఎందుకో నేటికీ వారు తెరాసలో చేరలేదు. నేటికీ వారిరువురూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటునప్పటికీ దానితో కలిసి పనిచేయడం లేదు. రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చినప్పుడు కోమటిరెడ్డి సోదరులిద్దరూ అందులో పాల్గొనలేదు అందుకు తమ మద్దతు ప్రకటించలేదు. మళ్ళీ నిన్న వారి స్వంత జిల్లా నల్గొండలోనే కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు అందరూ కలిసి నిర్వహించిన రైతు భరోసా యాత్ర సభకి కోమటిరెడ్డి సోదరులిద్దరూ మొహం చాటేశారు. వారు తెరాసలోకి వెళ్లేందుకే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ నేతలే అనుమానిస్తున్నారు. అటువంటప్పుడు తెరాసలోకి వెళ్ళకుండా ఇంకా ఎందుకు ఆగిపోయరంటే చాలా స్వేచ్చా స్వతంత్రాలు కోరుకొనే కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని సహిస్తూ ఆయన ముందు చేతులు కట్టుకొని ఉండలేమనే ఆలోచనతోనే తెరాసలో చేరేందుకు వెనకాడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటువంటప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం మంచిది. ఎందుకంటే కేవలం ఆ ఒక్క పార్టీలోనే స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది. కనుక జానారెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి దూరమయ్యి తమ రాజకీయ భవిష్యత్ ని తామే నాశనం చేసుకోవడం కంటే ఆయనతో రాజీపడి కాంగ్రెస్ పార్టీలో తమ స్థానం సుస్థిరం చేసుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కోమటిరెడ్డి సోదరులిద్దరూ చివరికి ఏమి నిర్ణయం తీసుకొంటారో..ఇలాగ ఎంతకాలం కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి దూరంగా ఉంటారో చూడాలి.
http://www.teluguone.com/news/content/komatireddy-venkata-reddy-45-51281.html





