కిరణ్ పధకాలకు డబ్బెక్కడి నుండి రాలుతుంది?
Publish Date:Apr 30, 2013
.jpg)
Advertisement
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధికారంలో లేని ప్రతిపక్షాలతో పోటీ పడుతున్నట్లు నిత్యం ఏదో ఒక కొత్త పధకంతో ప్రజల ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవాలనే ఆయన ఆలోచనను ఎవరూ కాదనరు. కానీ, ఆయన వారికి ఒక చేత్తో ఇస్తూ, మరో చేత్తో మరో వర్గం వారి జేబులోంచి బలవంతంగా డబ్బు గుంజుకోవడం ఏమనాలి?
ఇప్పుడు కరెంటు సర్ చార్జీలు పెరగడం నిత్య కృత్యం అయిపోయింది. ఇక బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకుల ధరలను సామాన్యులకే కాదు, మధ్యతరగతి వారికి సైతం భరించడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నఅమ్మ హస్తం, బంగారు తల్లి, పచ్చతోరణం ఇత్యాది పధకాలకు, ఇప్పటికే అమలవుతున్న జనని సురక్ష యోజన, ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, రాజీవ్ విద్యా దీవెన వంటి అనేక ఇతర పధకాలకు అవసరమయిన వేలకోట్ల రూపాయల డబ్బు ఆయన ఎక్కడి నుండి తీసుకువస్తారని ప్రశ్నిస్తే, ఆ భారం మోయవలసినది బాధ్యత సమాజంలో మిగిలిన ప్రజలదేనని చెప్పక తప్పదు. అంటే, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు పన్నులు చెల్లించక తప్పదన్నమాట.
ఇప్పటికే, ప్రజలు అధిక ధరలతో విలవిలలాడుతు తమ కష్టాన్నిఎవరికీ మోర పెట్టుకొవాలో తెలియక బాధపడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తున్నఈ పధకాలతో మరింత పన్ను భారం, మరిన్ని కొత్త పన్నులు మోయక తప్పదు. ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపరిచే ప్రయత్నం చేయవలసిన ప్రభుత్వాలు, వారిని ఎల్లకాలం ఇటువంటి సంక్షేమ పధకాల మీద ఆధారపడి బ్రతికేలా చేయడం చాలా దారుణమయిన ఆలోచన. ప్రభుత్వాలు ప్రజలకి ఉపాధి కల్పించి వారు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయాలి తప్ప, ఒకరి కష్టార్జితాన్ని మరొకరికి ఈ విధంగా పంపిణీ చేస్తూ రాజకీయ లబ్దిపొందాలనుకోవడం చాలా హేయమయిన పని.
ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు షర్మిల ఇద్దరూ ప్రకటిస్తున్న పధకాలకు లక్షల కోట్లు ఏ చెట్లు దులిపి తెస్తారని అడుగుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు తను ప్రకటించే పధకాలకు ఏ చెట్లు దులిపి తెస్తారో చెపితే బాగుంటుంది.
http://www.teluguone.com/news/content/kiran-kumar-reddy-39-22783.html












