కింగ్ కోహ్లీ పరుగుల యంత్రం.. విరాటుడికి రికార్డులు దాసోహం!
Publish Date:Apr 13, 2026
Advertisement
కింగ్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తరువాత దాదాపు ఆ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న గ్రేట్ క్రికెటర్. టెస్ట్, వన్డే, టి20 ఇలా మూడు ఫార్మట్లలోనూ కింగ్ కోహ్లీకి తిరుగే లేదు. అన్ని ఫార్మట్లలోనూ పరుగుల వరద పారించాడు. ప్రస్తతం అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో మాత్రం టి20లలో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆదివాకం (ఏప్రిల్ 12) జరిగిన పోరులో కోహ్లీ అరుదైన మైలురాయిని అధిగమించారు. టి20చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌పై 1,000 పరుగుల మార్కును చేరుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ రికార్డు పుటల్లోకెక్కారు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా తన బ్యాట్‌తో పరుగుల వరద పారించడం తనకు అలవాటేనని ఈ ఘనతతో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్‌తో కలిసి జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలోనే ముంబైపై తన వ్యక్తిగత పరుగుల సంఖ్యను నాలుగు అంకెలకు చేర్చారు. ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ముంబై లాంటి బలమైన జట్టుపై ఈ స్థాయిలో పరుగులు సాధించలేదు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీ 37 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు గతంలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ 1030 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కోహ్లీ తర్వాత కేఎల్ రాహుల్ 977 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ 901 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. అజింక్య రహానే (888), సురేష్ రైనా (850) వంటి హేమాహేమీలు తర్వాతి స్థానాల్లో ఉన్నప్పటికీ, వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరిన ఘనత మాత్రం తొలుత కోహ్లీయే అందుకున్నాడు. ముంబై బౌలర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ చూపిస్తున్న స్థిరత్వం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 37 ఏళ్ల వయస్సులోనూ కోహ్లీ తన ఫిట్‌నెస్, ఫామ్‌తో యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటి వరకు ఆయన ఆడిన ఇన్నింగ్స్‌లు కోహ్లీ ఇంకా రిటైర్మెంట్ ఇప్పుడప్పుడే కాదని స్పష్టం చేస్తున్నాయి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా 1,174 పరుగులు చేసిన రికార్డు విరాట్ పేరిట ఉంది. ఒ కే జట్టుపై వెయ్యికి పైగా పరుగులు సాధించడం ఆయన కెరీర్‌లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుత కోహ్లీ ఫామ్ చూస్తుంటే, ఈ ఐపీఎల్ సీజన్‌లోనే మరో భారీ రికార్డును అందుకోవడం ఖాయమనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మార్కును చేరుకోవడానికి కోహ్లీకి కేవలం 200 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే వచ్చే రెండు మూడు మ్యాచ్‌ల్లోనే కోహ్లీ ఘనతను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం టీ20 కెరీర్‌లో ఇప్పటికే 13,500 పరుగులకు పైగా సాధించిన విరాట్, క్రిస్ గేల్ రికార్డుల వైపు అడుగులు వేస్తున్నారు. వరుస రికార్డులతో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ ప్రదర్శనతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/king-kohli-he-run-machine-36-217264.html





