KGF రియల్ స్టోరీ ఇదే.. బంగారు గనుల అసలు చరిత్ర..
Publish Date:Apr 14, 2022

Advertisement
కేజీఎఫ్. చాప్టర్ 1 లానే చాప్టర్ 2 కూడా బ్లాక్‌బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. బాహుబలికి సవాల్‌గా మారింది. దర్శకత్వంలో రాజమౌళితో ప్రశాంత్ నీల్ పోటీ పడుతున్నారు. రాక్ స్టార్ యశ్.. హీరోయిజంను బాగా ఎలివేట్ చేశారు ఈ సినిమాలో. విలన్ రోల్ సైతం హీరోకు ధీటుగా ఉంటుంది. బంగారు గనులు సొంతం చేసుకోవడం కోసం జరిగే పోరాటమే ఈ చిత్రం ఇతివృత్తం. మరి, కోలార్‌ఱ గోల్డ్ ఫీల్డ్స్-KGF నిజంగా ఉన్నాయా? బంగారు తవ్వకాల సంగతేంటి? సినిమాలో మాదిరే బీభత్సమైన పోరాటాలు జరిగాయా? అనేది ఆసక్తికరం.
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో KGF ఉంది. బెంగళూరుకు 100 కిలోమీటర్లు, కోలార్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. దాదాపు 100 సంవత్సరాలపాటు ఆ ప్రాంతంలో బంగారం కోసం తవ్వకాలు జరిగినట్టు చరిత్ర చెబుతోంది. బంగారు గనులు అంతరించిపోవడంతో 2001 నుంచి అక్కడ తవ్వకాలను పూర్తిగా నిలిపేశారు.
KGF చరిత్ర పెద్దదే. వేల ఏళ్ల నుంచే కోలార్‌లో బంగారు గనులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బ్రిటిషర్ల హయాంలో అప్పటి గవర్నర్ జాన్ వారెన్.. కోలార్‌లో బంగారం ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని ఓ పుసక్తంలో రాసుకొచ్చారు. బంగారాన్ని వెలికి తీయాలని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్థుల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టాడు. ఎక్కువ మొత్తంలో మట్టిని సేకరించి పరిశీలించగా.. అందులో అతి తక్కువ మొత్తంలో బంగారం ఉందని, ఇది వ్యాపారపరంగా ఓ వృథా ప్రయత్నమేనని భావించాడు. బంగారం తవ్వాలనే ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేశాడు.
1850 తర్వాత లావెల్లీ అనే ఓ బ్రిటిష్ అధికారి వారెన్ రాసిన పుస్తకాన్ని చదివి మళ్లీ బంగారం వేట మొదలుపెట్టాడు. అప్పటి మైసూర్ రాజుల నుంచి గనుల తవ్వకాలకు అనుమతులు సంపాదించాడు. ఆ తర్వాత జాన్ టేలర్.. కంపెనీ చొరవతో కోలార్‌లో తవ్వకాలు మొదలుపెట్టాడు. మైనింగ్‌కు అవసరమైన విద్యుత్ కోసం ఓ భారీ పవర్ ప్లాంట్‌ని సైతం ఇక్కడ నిర్మించారు. 30 వేల మంది కార్మికులు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో పని చేశారని చెబుతారు. ఏళ్లు గడిచే కొద్దీ ఉన్న కాస్త బంగారు నిల్వలు సైతం తరిగిపోవడంతో.. 2001లో ప్రభుత్వం ఆ ప్రాంతంలో తవ్వకాలను నిలిపివేసింది.
అయితే, కేజీఎఫ్ సినిమాకు రియల్ కేజీఎఫ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కల్పిత కథ మాత్రమే. బంగారం గనుల కోసం, తవ్వకాల కోసం ఎలాంటి పోరాటాలు జరగలేదు. అసలక్కడ వ్యాపారం చేసేంత బంగారు నిల్వలు లేనే లేవు. ‘నరాచీ’.. రాకీ భాయ్, గరుడ, అధిర.. తదితర క్యారెక్టర్లు ఏవీ రియల్ కేజీఎఫ్‌లో లేవు. సినిమా సినిమా మాత్రమే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నిజంగా ఉన్నా.. చిత్ర కథ మాత్రం పూర్తిగా కల్పితం. కాకపోతే.. రియల్ కేజీఎఫ్ చుట్టూ పవర్‌ఫుల్ స్టోరీని, ఫుల్ యాక్షన్ డ్రామాను, శక్తివంతమైన పాత్రలను సృష్టించుకుని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతమైన సినిమా తీశాడు. అందుకే, ఇప్పుడు కేజీఎఫ్‌తో పాన్ ఇండియా రికార్డులు బద్దలవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/kgf-real-story-39-134404.html












