పాపం కేశినేని నాని.. విజయవాడ ఎంపీ సీటు గోవిందా?
Publish Date:Feb 2, 2024
Advertisement
విజయవాడ ఎంపీ కేశినేని నాని పరిస్థితి వైసీపీలో అగమ్యగోచరంగా తయారైంది. తనకు సముచిత ప్రాధాన్యత ఇచ్చి, గౌరవంగా చూసిన తెలుగుదేశం పార్టీని అహంకారంతో వీడి వైసీపీ గూటికి చేరితే అక్కడ కనీస గుర్తింపు కూడా లేకుండా పోయింది. ప్రజా వ్యతిరేకత పేరు చెప్పి సిట్టింగులకు ఇష్టారాజ్యంగా మార్చేస్తున్న ఏపీ సీఎం జగన్ కేశినేనికి కూడా అదే కారణంతో విజయవాడ లోక్ సభ స్థానం నిరాకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన తరువాత నుంచి ఆయనకు ఆ పార్టీలో అడుగడుగునా అవమానాలూ, పరాభవాలే ఎదురౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు విజయం సాధించిన కేశినేని నాని అదంతా తన ప్రతిభే అన్న అతిశయం, అహంభావం, పొంగరుబోతుతనంతో వ్యవహరించారు. ఫ్రాంక్ నెస్ అన్న ముసుకు వేసుకుని అవధులు లేని అహంభావంతో వ్యవహరించిన కేశినేని నానికి ఆలోచన అన్నది ఏ మాత్రం లేదని ఆయన వైసీపీ గూటికి చేరిన తరువాత అందరికీ అర్ధమైపోయింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన స్వతంత్రంగా వ్యవహరించేవారు. పార్టీ అధినేత సైతం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ వైసీపీలో చేరిన తరువాత ఆయన పరిస్థితి గుంపులో గోవిందాగా మారిపోయింది. వైసీపీలో చేరేందుకు ఆయన తనకు విజయవాడ ఎంపీ, తాను సూచించిన మరో ఐదుగురు నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని షరతు విధించారని, అయితే పార్టీలో చేరిన తరువాత ఆయన ఏ షరతులతో అయితే వైసీపీ గూటికి చేరారో వాటిలో వేటినీ జగన్ ఖాతరు చేయడం లేదని వైసీపీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. కేశినేని వైసీపీ గూటికి చేరిన తరువాత జగన్ విజయవాడ ఎంపీ టికెట్ తో పాటు తిరువూరు అసెంబ్లీ స్థానం మాత్రమే కేశినేని కోటా అని స్ఫష్టం చేసేశారని చెబుతున్నారు. దీంతో కంగుతిన్న నాని, మరో గత్యంతరం లేక సర్దుకుపోయారని చెబుతారు. తెలుగుదేంలో ఉన్నప్పుడు విజయవాడలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఎంపీ హోదాలో ఉన్న కేశినేని నానికి ప్రాధాన్యత లభించేది. వేదికపై చంద్రబాబు పక్కనే స్థానం కూడా లభించేది. అయితే వైసీపీలో నానికి ఎలాంటి ప్రాధాన్యతా లభించడం లేదు. బెజవాడలో పార్టీ కార్యక్రమాలలో విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉండి, మీడియాతో మాట్లాడితే… స్వతంత్ర భావాలుండి, ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే కేశినేని నాని మాత్రం..ఎక్కడో వెనుక నిలబడి సర్దుకు పోవాల్సి వస్తోంది. దీంతో నాని పరిస్థితి కోరి తలకొరివి పెట్టుకున్నట్లుగా మారిపోయింది. మింగలేక కక్కలేక ముఖం చాటేస్తున్న పరిస్థితి. నానికి వైసీపీలో ఎదురౌతున్న పరాభవాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానికి కనీస ప్రొటోకాల్ కూడా లభించలేదు. అయినా కేశినేని నాని కిమ్మనకుండా ఉండటం చూస్తుంటే ఆయన వైసీపీలో అణిగిమణిగి ఉండడానికి మానసికంగా సిద్ధమైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా విజయవాడ ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ విషయంలో కూడా నానికి చుక్కెదురయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. కేశినేని వైసీపీలో చేరడానికి ముందే జగన్ ఆయనను విజయవాడ ఎంపీ సమన్వయకర్తగా నియమించేశారు. పెద్ద పీట వేస్తానని హామీలూ గుప్పించేశారు. కానీ కేశినేని పార్టీలో చేరిన తరువాత మాత్రం పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఏకంగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి కాకుండా మైలవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలంటూ సంకేతాలు పంపిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేశినేని నానిని మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలని జగన్ ఆదేశించినట్లు చెబుతున్నారు. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశ పూర్వకంగా దూరం జరుగుతూ, తాను పార్టీ మారనున్నాన్న సంకేతాలు ఇస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం కేశినేని నానికి మైలవరం బాధ్యతలు అప్పగించింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నిర్భయంగా గళమెత్తి తన అసంతృప్తిని చాటే స్వేచ్ఛ అనుభవించిన నాని ఇప్పుడు అవమానాలను దిగమింగుకుంటూ కిమ్మనకుండా జగన్ ఆదేశాలను పాటిస్తున్నారు. అందుకే అంటారు చేసుకున్నవారికి చేసుకున్నంత అని.
http://www.teluguone.com/news/content/kesineni-nani-facing-insult-in-ycp-25-169816.html





