బిఆర్ఎస్ కు భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గుడ్ బై
Publish Date:Feb 3, 2024
Advertisement
బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.
వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తాటికొండ రాజయ్యకు గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ మారనున్నారని ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు వీర విధేయుడైన తాటికొండ రాజయ్య తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్ లో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని టిఆర్ఎస్ తొలి ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కెసీఆర్ తొలి ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం రాజయ్యకు వరించింది. కెసీఆర్ కేబినెట్ లో వైద్యశాఖా మంత్రిగా పని చేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. తర్వాతి కాలంలో సర్పంచ్ నవ్య రాజయ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను వేధింపులకు గురి చేశారని ఆరోపణలు చేశారు. మీడియాలో రాజయ్యపై నెగెటివ్ ప్రచారం జరగడంతో బిఆర్ఎస్ పక్కన పెట్టింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి ప్రోద్బలంతోనే సర్పంచ్ నవ్య ఆరోపణలు చేస్తూ వచ్చినట్లు రాజయ్య వివరణ ఇచ్చారు.
గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం... రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికే సీఎంను కలిశామని వీరు చెపుతున్నప్పటికీ... వీరి కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది.
http://www.teluguone.com/news/content/thatikonda-rajaiah-resigne-25-169829.html





