కేసీఆర్ ఆయుధాలు అయిపోయాయా?.. బీఆర్ఎస్ జోరు చూపేనా?
Publish Date:Jan 15, 2023
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో షికారు చేసిన పార్టీని ఇకపై దేశవ్యాప్తంగా షికారు చేయించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే... ఆ పార్టీ తెలంగాణ కనబరిచిన జోరు దేశవ్యాప్తంగా ఉంటుందా? అంటే సందేహమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ మారడం వల్ల.. తెలంగాణ అనే పదం స్థానంలో భారత్ అనే పదం వచ్చి చేరడం వల్ల.. ఇది తెలంగాణ ప్రజలను ఇకపై అంతగా ప్రభావితం చేయలేదని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2014 నుంచి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలు జరిగినా... ఆంధ్ర అనే పదాన్ని ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకొంటూ.. కారు పార్టీ నాయకత్వం తెలంగాణ గడ్డపై షికారు చేసింది. అందుకు ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అన్న తేడా లేకుండా ఏకపక్షంగా ఆ పార్టీ గెలిచిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకొందని... దీంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే... మళ్లీ చంద్రబాబు తెలంగాణ గడ్డపై నుంచి రాజ్యమేలతాడంటూ.. తెలంగాణ ప్రజల్లో ప్రచారం చేసి విజయం సాధించడంలో కేసీఆర్ 100కి వంద శాతం సఫలీకృతమయ్యారనీ అలా తెలంగాణ సెంటిమెంటుతో కేసీఆర్ ఇప్పటి వరకూ ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నారనీ, ఇక పార్టీలో తెలంగాణ ఆత్మను తీసేసిన తరువాత ఆ సెంటిమెంట్ ను మళ్లీ వర్కౌట్ చేయడం కష్టమనీ అంటున్నారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఫ్యామిలీ ఇదే రీతిగా వ్యవహరించిందనడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగణ గెడ్డపై తెలుగుదేశం పార్టీలో కేడర్ ఎంత బలంగా ఉన్నా.. సైకిల్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడంలో వెనకబడిపోయిందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాండవులు... జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను దించినట్లు.. తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్ లీ ఓ ఆయుధంగా అవసరమైనప్పుడు వాడుకొంటూ.. ఎన్నికల రణక్షేత్రానికి వెళ్లేవారని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత.. తెలంగాణ అనే సెంటిమెంట్.. ఎక్సపైయర్ అయిన అయిమెంట్‌లాగా అయిపోయిందని.. దీంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణ గడ్డపైనే కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ స్థిరమైన నాయకత్వాన్ని కోల్పోబోతున్నదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ గడ్డ మీదే.. కేసీఆర్‌కు ఓట్లు పడడం కష్టమని చెబుతున్నారు. మరోవైపు గతంలో తెలంగాణ గడ్డపై కేసీఆర్ పార్టీ ఉన్నంత బలంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవీ లేవని.. కానీ ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ బలం పుంజుకొంటున్నాయని వారు చెబుతున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ ఎంతగా ప్రయత్నిస్తున్నారో.. అంతే పోటీగా.. బీజేపీ జెండాని తెలంగణ గడ్డపై రెపరెపలాడించలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోందని.. అలాగే రేవంత్ రెడ్డి సారథ్యలోని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్తోందని.. ఇక టీడీపీ సైతం వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని కృత నిశ్చయంతో ఉందని.. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్.. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలుపుకొంటారా? అంటే అనుమానమే అని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో అభిప్రాయపడుతున్నారు. ఇంకో వైపు దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తుండంతో.. తెలంగాణలో గద్దెనెక్కేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడిన తెలంగాణ సెంటిమెంట్ ఏమంత ఉపయోగపడదనీ చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-vepon-telangana-no-more-powerful-39-150020.html





