టీఆర్ఎస్ పాలిట తుమ్మల తుమ్మముల్లు కానున్నారా?
Publish Date:Nov 7, 2014
Advertisement
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఆయన ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి చేతిలో పెట్టేసిన సందర్భంలో రాజకీయంగా పార్టీ కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడే ఉద్దేశంతో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఆనాడు చంద్రబాబు చేసిన తిరుగుబాటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పచ్చగా కళకళలాడుతూవుండటానికి ప్రధాన కారణమైంది. ఆనాడు ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే, ఈనాడు తుమ్మల నాగేశ్వరరావు కారణంగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు తిరుగుబాటు చేసే అవకాశం వుందని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఖమ్మం జిల్లా నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌కి జిగిరీ దోస్త్. ఎంత దోస్త్ అంటే... ఒకర్నొకరు ఆప్యాయంగా ‘బావా.. బావా’ అని పిలుచుకునేంత దోస్త్. ఆ దోస్తీ కారణంగానే తుమ్మల తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తుమ్మల పార్టీ మారడం వెనుక కేసీఆర్ ఇచ్చిన మంత్రి పదవి ఆఫర్ కూడా ప్రధాన కారణమనే అభిప్రాయాలు వున్నాయి. కేసీఆర్ అవసరమైతే తల నరుక్కుంటారు తప్ప తన సొంత మనుషులకు ఇచ్చిన మాట మాత్రం ఎంతమాత్రం తప్పరు. తుమ్మలకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ త్వరలో ఆయనకు హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌కి మొదటి నుంచీ సేవ చేసిన నాయిని నరసింహారెడ్డి ఇప్పుడు హోం మంత్రిగా వున్న విషయం తెలిసిందే. నాయినిన తప్పించి తుమ్మలను ఆ స్థానంలో హోం మంత్రి చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. తన అనుంగు మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావుకు హోం మంత్రి పదవిని అప్పగించిన అనంతరం కేసీఆర్ తన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే నిమిత్తం ఓ రెండు నెలలపాటు అమెరికా వెళ్ళనున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకూ తెలంగాణ ప్రభుత్వ బాధ్యత మొత్తం హోం మంత్రి పదవిలో వుండే తుమ్మలతోపాటు కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కి అప్పగించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆలోచన ఇలా వుంటే, కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆలోచన మాత్రం మరోరకంగా వున్నట్టు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ హోం మంత్రి బాధ్యతలు అప్పగించిన వెంటనే పార్టీలో తిరుగుబాటు చేయడానికి హరీష్ రావు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. హరీష్ రావు తిరుగుబాటు చేసిన పక్షంలో ఆయనకు 25 నుంచి 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారని తెలుస్తోంది. వారికి తోడుగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకుని హరీష్ రావు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. హరీష్‌రావు ఈ తరహా ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసి కూడా సీఎం కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. హరీష్ రావు కూడా పైకి తాను కేసీఆర్‌కి విధేయుడిగా వుంటానని చెబుతున్నప్పటికీ, తుమ్మలకు హోం మంత్రి పదవి ఇవ్వగానే తన యాక్షన్ ప్లాన్ అమలులో పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా వుంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారికి, తన బంధుమిత్రులకే అన్ని విషయాలలోనూ కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న బాధ వారిలో వుంది. దీనితోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల వారు కూడా కేసీఆర్‌ని వ్యతిరేకిస్తూ వున్నారు. త్వరలో నాయిని పదవి ఊడిపోబోతోందని తెలిసిన రెడ్డి సామాజిక వర్గం వారు కూడా కొంత ఆగ్రహంగా వున్నారు. ఇలాంటి వ్యతిరేక శక్తులన్నిటికీ చేరువ అవుతున్న హరీష్ రావు ‘కీలక సమయం’లో వీరందరి సహకారం తీసుకోవడానికి వ్యూహ రచన చేసినట్టు సమాచారం. తెలుగునాట గతంలో రెండు సందర్భాలలో అధికార మార్పిడి ‘కుదుపు’లు సంభవించాయి. ఒక కుదుపుకు కారణం నాదెండ్ల భాస్కరరావు అయితే, మరోసారి లక్ష్మీపార్వతి కారణం అయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ కుదుపుకు తుమ్మల నాగేశ్వరరావు కారణం అవుతారనీ, టీఆర్ఎస్ ప్రభుత్వ బుడగ పాలిట తుమ్మల తుమ్మముల్లుగా మారతారనీ అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఈ అంశం మీద మరో రెండు మూడు నెలల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
http://www.teluguone.com/news/content/kcr-tummala-nageswara-rao-harish-rao-revolution-45-39974.html





