ప్చ్.. పాపం ఈటెల...
Publish Date:Nov 7, 2014
Advertisement
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఎంత పవర్ ఫుల్ నాయకుడో అందరికీ తెలిసిందే. ఆయన సీమాంధ్రుల మీద మాటల ఈటెలు విసిరారంటే ఆ ఈటెలు డైరెక్టుగా సీమాంధ్రుల గుండెల్లో దిగబడతాయి. ఆయన మాటల కారణంగానే ఈటెల టీఆర్ఎస్‌లో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇంత పవర్‌ఫుల్ వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చాలా సన్నిహితుడు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఆయన మాట వేదంలా చెల్లుతుందని ఎవరైనా అనుకుంటారు. బట్.. ఈటెలకి ప్రభుత్వంలో అంత సీన్ లేదని, ఆయన మాటకు గడ్డిపోచంత విలువ కూడా లేదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను విశ్వసనీయ వర్గాలు బయటకి లీక్ చేశాయి. ఈటెల రాజేందర్ మంత్రి అయిన తర్వాత ఆయన బంధువులు కొంతమంది ఆయన దగ్గరకి వచ్చి ‘‘రాజేందరన్నా.. రాజేందరన్నా... మేం తెలంగాణలో ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాం. మమ్మల్ని ఆ ఫలానా చోట నుంచి ఈ ఫలానా చోటకి ట్రాన్స్‌ఫర్ చేయించవా... ప్లీజ్’’ అని రిక్వెస్ట్ చేసుకున్నారట. వారి రిక్వెస్టులకి కరిగిపోయిన ఈటెల ‘‘మీరు కోరినట్టే ట్రాన్స్‌ఫర్ చేయిస్తా పొండి’’ అని వాళ్ళకి హామీ ఇచ్చేశారట. సదరు బంధువులు ఇక తాము ట్రాన్స్‌ఫర్ అయిపోయినట్టే అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయారట. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఈటెలకి బుర్ర తిరిగిపోయేలా చేశాయట. మా బంధువులని కాస్త ట్రాన్స్‌ఫర్ చేసిపెట్టరూ అని ప్రభుత్వంలో ఎవరిని అడిగినా పని కాలేదట. సీఎం కేసీఆర్ చెబితేనే ట్రాన్స్‌ఫర్ చేస్తామని అధికారులు నిర్మొహమాటంగా చెప్పడంతో ఈటెల బిత్తరపోయారట. అయినప్పటికీ గుండె రాయి చేసుకుని కేసీఆర్‌కి కూడా ఈ విషయాన్ని విన్నవించుకుంటే, ఆయన చాలాకాలంగా ఏ విషయమూ తేల్చకుండా ఇష్యూని పక్కన పెట్టేశారట. ఈ ట్రాన్స్‌ఫర్లు జరక్కపోతే తన బంధువర్గంలో తన పరువు ఫినాయిల్, యాసిడ్‌తో కడిగినట్టుగా పోతుందని ఈటెల ఫీలైపోయారట. సరే, నామాట ఎలాగూ చెల్లడం లేదు. నా ఫ్రెండ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెబితే అయినా పని అవుతుందేమోననని ఈ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డి చెవిలో వేశారట. తన సహచర మంత్రి ఈటెల ఆవేదనను విని గుండె చెరువైపోయిన జగదీశ్వర్‌రెడ్డి ఈటెలకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యారట. సీఎం కేసీఆర్ మూడ్ బాగున్నప్పుడే నీ బంధువుల ట్రాన్స్‌ఫర్ విషయం సీఎం దగ్గర ప్రస్తావించి పనయ్యేట్టు చూస్తానని జగదీశ్వర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఈటెల హ్యాపీగా ఫీలయ్యారట. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తన మిత్ర ధర్మం ప్రకారం ఓ సందర్భంలో కేసీఆర్ మూడ్ బాగుందని అనుకుని ఈ ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం ఆయన దగ్గర ప్రస్తావించారట. అంతే, కేసీఆర్ ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమైపోయి అక్కడే వున్న ఓ అరడజను మంది ఐఏఎస్ ఆఫీసర్ల ముందే జగదీశ్వర్‌రెడ్డిని ‘‘ఈటెల ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం గురించి నా దగ్గర ప్రస్తావిస్తున్నావ్.. నువ్వేమైనా తురుంఖాన్‌వా? ఈటెల చెప్పడమేంటి.. నువ్వు నాకు చెప్పడమేంటి’’ అని చెడామడా క్లాస్ పీకేశారట. దాంతో జగదీశ్వర్‌రెడ్డి ముఖం చెల్లని చిల్లుకాణీ అంత అయిపోయిందట. మొగుడు తిట్టినందుకు బాధలేదు.. తోడికోడలు నవ్విందనే బాధ అన్నట్టుగా, కేసీఆర్ చెడామడా క్లాస్ పీకినందుకు బాధ లేదుగానీ, ఐఏఎస్ ఆఫీసర్ల ముందే క్లాస్ పీకారని జగదీశ్వర్‌రెడ్డి ఈటెలతో ఆవేదనగా చెప్పుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ తమ పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని జాయింటుగా బాధపడి, ఒకర్నొకరు ఓదార్చుకున్నారట.
http://www.teluguone.com/news/content/etela-rajender-kcr-telangana-minister-insult-to-etela-45-39987.html





