కేసీఆర్ రాజకీయ వ్యవసాయం.. ఆ మూడు రాష్ట్రాలపైనే గురి!
Publish Date:Sep 1, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనక ఒక వ్యూహం ఉంటుంది. ఒక ఎత్తుగడ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్ కు పిలిపించుకుని, మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. విందు వినోదాలతో చక్కని ఆతిధ్య మిచ్చారు. శాలువాలు కప్పి సన్మానాలు చేశారు. ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ మూడు రోజుల రైతు వేడుకలకు, సర్కార్ ఖజానా నుంచి తెలంగాణ ప్రజల సొమ్ము ఎన్ని కోట్లు ఖర్చైదో, ఏమో మనకు తెలియదు. ఎందుకంటే శ్రీ సర్కార్ వారు చెప్పలేదు. చెప్పరు. అదొకటి అలా ఉంటే, అన్ని రాష్ట్రాల రైతు నాయకులను విమానాలు ఎక్కించి తీసుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక్క ఆహ్వానం పంపిస్తే రెక్కలు కట్టుకుని వచ్చి వాలే, తెలంగాణ రైతు రైతు సంఘాల నాయకులను మాత్రం ఎందుకనో పిలవలేదు. ఎందుకనో ఏముంది , పిలిస్తే, అందరి ముందు అసలు బండారం బయట పడుతుందనే. అందుకే రాష్ట్ర రైతులను రైతు వేడుకలకు దూరంగా ఉంచారని అంటున్నారనుకోండి అది వేరే విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందు కోసం దేశంలో ఉన్న రైతు నాయకులు అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంటే, అందుకు సమాధానం వెతుక్కోవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం జాతీయ రాజకీయాలపై కేంద్రీకృతమై వుంది. రాష్ట్రంలో వీస్తున్న ఎన్నికల ఎదురు గాలిని తట్టుకోవాలన్నా, రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎదురవుతున్న సమస్యల నుంచి బయట పడాలన్నా, మరీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కుంటున్న అవినీతి ఆరోపణల ఉచ్చులోంచి బయటపడాలన్నా, జాతీయ రాజకీయాల పంచన చేరడం మినహా మరో దారి కనిపించడం లేదు. అందుకే, ఏదో విధంగా జాతీయ రాజకీయాలలో గుర్తింపు కోసం ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అందులో భాగంగానే, వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులను రప్పించి వారిచేతే, ఆహా వోహో అనిపించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కూసింత గుర్తింపు కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్,బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు మొదలు, బీజేపీ ముక్త భారత్ నినాదంతో కొత్త పార్టీ లేదా ఫ్రంట్ ఏర్పాటు వరకు ఆయన చేయని ప్రయత్నం ఏదీ లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జాతీయ పత్రికలు మీడియాలో ప్రచారం చేసుకున్నారు,. అదొకటనే కాదు,ఒక విధంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాసింత గుర్తింపు కోసం రాజకీయ అష్టావధానం, శతావధానం ఒకేసారి చేస్తున్నారు..అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో, భారత రైతు సమితి (బీఆర్ఎస్) పేరిట రైతు నాయకులను ప్రయోగాత్మకంగా బరిలో దించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే జాతీయ స్థాయిలో రైతు వేదిక ఏర్పాటు పేరిట జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, ఈ మూడు రాష్ట్రాలను ఎంచుకోవడంలోనూ కేసీఆర్ మార్క్ రాజకీయం ఉన్నది అంటున్నారు. . ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. తెలంగాణలో అమలవుతున్న రైతు భీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, వంటి పథకాలను ప్రచారం చేసుకోవడంతో పాటుగా బీజేపీ వ్యతిరేక ప్రచారం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీజేపీ నేతలు గుజరాత్ మోడల్ పేరుతో జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ మోడల్‌ను తెరపైకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల్లో రైతుల నేతలు అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ... ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆ మూడు రాష్ట్రాలలో ప్రచారం చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ పై చర్చ జరిగేలా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అది సాధ్యమేనా? ఒక జాతీయ పార్టీతో పట్టుమని పది పార్లమెంట్ స్థానాలు లేని ఒక ప్రాంతీయ పార్టీ పోటీ పడటం అయ్యే పనేనా , అంటే, ఏమో .. గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-political-agriculture-aim-on-that-three-states-only-25-143059.html





