రానున్న కాలంలో... కార్‌కి ప్రొఫెసర్‌తో పోరు తప్పదా?
Publish Date:Feb 13, 2017
Advertisement
ఆంధ్రాలో చంద్రబాబుకి జగన్ వున్నాడు! కాని, తెలంగాణలో కేసీఆర్ కి ఎవరున్నారు? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కావటంతో కేసీఆర్ కు బలైమన ప్రత్యర్థే కరువయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు కరువు లేకున్నా ఢిల్లీ ఆదేశాల మేరకు నడుచుకునే ఆ పార్టీలో ఫుల్ టైం ప్రతిపక్ష నేతగా సత్తా చాటే ఓపిక, ధైర్యం ఎవ్వరికి లేనట్లు అర్థమైపోతోంది. అయితే, కోదండరామ్ ప్రతిపక్షానికి వున్న లోటు తీర్చే ప్రయత్నంలో వున్నారా? పరిస్థితి చూస్తుంటే రాజకీయ నేతలు చేయని పని, చేయలేని పని ప్రొఫెసర్ గారు చేసేలా కనిపిస్తున్నారు! కేసీఆర్ ను ఎదుర్కోవటం కష్టం. ఆయనకు సామ, దాన, భేదో, దండోపాయాలు అన్నీ తెలుసు! తన పార్టీలో వచ్చి చేరి జైకొడితే సామంతో సరిపెడతాడు. కాదని మొండికేస్తే, రేవంత్ రెడ్డి విషయంలో చేసినట్టు దండోపాయమూ ప్రయోగిస్తాడు. అందుకే, కాంగ్రెస్ , బీజేపి, ఎంఐఎం, కమ్యూనిస్టులు .... ఎవ్వరూ ఆయన్ని గట్టిగా గద్దించలేకపోతున్నారు. అలాగని కేసీఆర్ పాలన లోపాలే లేకుండా వుందా అంటే,అదీ లేదు! కొన్ని పనులు గొప్పగా జరుగుతోన్నా కొన్ని పనులు, ప్రజల ఆకాంక్షలు అస్పలు నెరవేరటం లేదు! మరీ ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమానికి దశాబ్దాల పాటూ కారణంగా నిలచిన ఉపాధి విషయంలో చాలా అసంతృప్తి వుంది జనంలో! జేఏపీ చైర్మన్ కోదండరామ్ నిరుద్యోగుల్నే తన కేసీఆర్ వ్యతిరేకు ఉద్యమానికి సైన్యంగా మార్చుకున్నాడు. ఈ నెల ఇరవై రెండున ఉద్యోగాల కోసం ర్యాలీ అంటూ కార్యక్రమం తల పెట్టారు! దీన్ని జరగకుండా చూడాలని ప్రభుత్వం ఎలాగూ చూస్తుంది. ఆ బల ప్రయోగమే ఇప్పుడు కోదండరామ్ కి కావాలి. ప్రభుత్వం అణిచివేతకి దిగితేనే జనంలో దాని పట్ల వ్యతిరేకగా వ్యక్తం అవుతుండటం జరుగుతుంది! ట్యాంక్ బండ్ మీద విగ్రహాల కూల్చివేత మొదలు రైల్ పట్టాల మీద పడుకోవటం వరకూ తెలంగాణ ఏర్పాటుకి ముందు కేసీఆర్ , కోదండరామ్ లది ఒకే మాట. కాని, ఇప్పుడు అదే కేసీఆర్ కు వ్యతిరేకంగా కోదండరామ్ గళం విప్పుతున్నాడు. దీనికి కారణం ఆయన మనసులో ఏమున్నా... జేఏసీ చైర్మన్ మరోసారి రంగంలోకి దిగి కేసీఆర్ ని ఎదుర్కోవాల్సి వచ్చిందంటే అది ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం వైఫల్యమే! దాన్ని భర్తీ చేసేందుకే ప్రొఫెసర్ రంగంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ స్థాపన కూడా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కోదండరామ్ పూర్తి స్థాయి రాజకీయ నేత అవతారం ఎత్తితే మాత్రం అది కేసీఆర్ కి, టీఆర్ఎస్ కి డ్యామేజింగ్ వ్యవహారమే. అధికారం కోల్పోవటం గ్యారెంటీ లాంటి అంచనాలు వేయలేం కాని... కార్ కు పంక్చర్ లు అయ్యే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా వుంది! చూడాలి మరి... పాలిటిక్స్ లో పట్ట పొందని ప్రొఫెస్ కేసీఆర్ రాజనీతి శాస్త్రం బోధించే ఈ రియల్ పొలిటికల్ ప్రొఫెసర్ ని ఎలా కట్టడి చేస్తాడో!
http://www.teluguone.com/news/content/kcr-45-72107.html





